జార్ఖండ్ పాఠశాలలు 1 నుండి 12వ తరగతి వరకు ఫిబ్రవరి 1, 2022న తిరిగి తెరవబడతాయని విద్యాశాఖ మంత్రి జగన్నాథ్ మహ్తో శనివారం తెలిపారు. అయితే పాఠశాలల పునః ప్రారంభంపై తుది నిర్ణయం తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు ప్రతిపాదన పంపారు. ఈ విషయమై విద్యాశాఖ మంత్రి తల్లిదండ్రులు, ఇతర మేధావులతో చర్చించారు. రాష్ట్రంలోని పాఠశాలలను పునఃప్రారంభించిన తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరిస్తామని మంత్రి తెలిపారు. జార్ఖండ్ పాఠశాలలను తిరిగి తెరవడం గురించి తుది ప్రకటన జనవరి 31, 2022న ప్రకటించబడుతుంది.
జార్ఖండ్ విద్యా మంత్రి జగన్నాథ్ మహ్తో మాట్లాడుతూ.. "ఆన్‌లైన్ తరగతులు అస్సలు విజయవంతం కాలేదు. ప్రభుత్వ పాఠశాల పిల్లలు కూడా ప్రభావితమవుతున్నారు. చాలా రాష్ట్రాలు పాఠశాలలను తిరిగి ప్రారంభిస్తున్నాయి. జార్ఖండ్‌లో కూడా పాఠశాలలను తిరిగి తెరవడానికి రాష్ట్రంలో సన్నాహాలు జరుగుతున్నాయి. పాఠశాలల్లో ఫీజుల వసూలు వ్యవహారంలో మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి జగన్నాథ్ మహ్తో తెలిపారు. మరో వైపు తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నింటినీ ఫిబ్రవరి 1 నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. విద్యాసంస్థల్లో కరోనా నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. పాఠశాల యాజమాన్యాలు ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటనను విడుదల చేశారు.