నా కొడుకు అమాయకుడు.. పోలికలు ఉన్నాయ‌న్న అనుమానంతోనే అరెస్ట్ చేశారు

సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి చేసిన షరీఫుల్ ఇస్లాం సజ్జాద్ ప్ర‌స్తుతం ముంబై పోలీసుల అదుపులో ఉన్నాడు.

By Medi Samrat  Published on  24 Jan 2025 2:35 PM IST
నా కొడుకు అమాయకుడు.. పోలికలు ఉన్నాయ‌న్న అనుమానంతోనే అరెస్ట్ చేశారు

సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి చేసిన షరీఫుల్ ఇస్లాం సజ్జాద్ ప్ర‌స్తుతం ముంబై పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడి నుంచి దాడికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని రాబట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా.. దాడి చేసిన వ్యక్తి తండ్రి మహ్మద్ రూహుల్ అమీన్.. తన కొడుకు నిర్దోషి అని ప్రకటించాడు. తండ్రి మహ్మద్ రుహుల్ అమీన్ మాట్లాడుతూ.. తన కొడుకు నిర్దోషి అని, అతన్ని వెంటనే విడుదల చేయాలని భారత్‌ను కోరాడు. నటుడు సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడులకు సంబంధించి షరీఫుల్‌ను ముంబైలో అరెస్టు చేశారు.

షరీఫుల్ ఇస్లాం రాజధాని ఢాకా నుండి 200 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న బంగ్లాదేశ్‌లోని దక్షిణ జిల్లా ఝలకతిలోని రాజబారియా గ్రామ నివాసి. షరీఫుల్ తన ముగ్గురు కుమారుల్లో రెండో కుమారుడని మహ్మద్ రూహుల్ అమీన్ పేర్కొన్నాడు. మహ్మద్ రూహుల్ అమీన్ ANIతో ఫోన్‌లో మాట్లాడారు.

నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేసినందుకు నా 30 ఏళ్ల కుమారుడు షరీఫుల్ ఇస్లాం సజ్జాద్‌ను భారత్‌లో అరెస్టు చేసినట్లు నేను వివిధ యూట్యూబ్ ఛానెల్‌లు, జర్నలిస్టుల ద్వారా తెలుసుకున్నాను. దాడిలో పాల్గొన్న వ్యక్తి పోలికలు ఉన్నాయ‌న్న అనుమానంతోనే నా కొడుకును అరెస్ట్ చేశారు. నా కొడుకు అమాయకుడు. కొడుకు విడుదల కోసం దౌత్యపరమైన చొరవ తీసుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని అభ్యర్థించాను. 3 లేదా 4 రోజుల తర్వాత బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు వెళ్లి తన కుమారుడిని విడిపించడానికి దౌత్యపరమైన చొరవ తీసుకోవాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తానని దాడి చేసిన వ్యక్తి తండ్రి చెప్పారు.

షేక్ హసీనా హయాంలో వేధింపుల నుండి తప్పించుకోవడానికి తన కుమారుడు భారతదేశానికి వెళ్లాడని.. మా కుటుంబం BNP రాజకీయాలతో ముడిపడి ఉందని మహ్మద్ రుహుల్ అమీన్ పేర్కొన్నారు. నా కుటుంబానికి బీఎన్‌పీతో సంబంధం ఉన్నందున రాజకీయ ప్రత్యర్థులు నా కొడుకులను తప్పుడు కేసుల్లో ఇరికించి వేధించారని అమీన్ పేర్కొన్నారు. వారి వేధింపుల కారణంగానే ఇంట్లో ఉండలేక దేశం విడిచి వెళ్లిపోయాడని వెల్ల‌డించారు.

Next Story