రేపటి నుంచి అందుబాటులోకి రానున్న FASTag వార్షిక పాస్
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) యొక్క అన్ని రహదారులపై స్వాతంత్ర్య దినోత్సవం నుండి వార్షిక పాస్ పథకం అమలుకానుంది.
By Medi Samrat
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) యొక్క అన్ని రహదారులపై స్వాతంత్ర్య దినోత్సవం నుండి వార్షిక పాస్ పథకం అమలుకానుంది. ప్రతి 20-30 కిలోమీటర్లకు టోల్ ట్యాక్స్ చెల్లించడం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఇది ఉపశమనం కలిగిచనుంది. భారత ప్రభుత్వం ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ పథకాన్ని ప్రారంభించింది. ఆగస్టు 15 నుంచి ఇది దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది. దీని కింద వాహనదారులు రూ. 3,000 వార్షిక నేషనల్ టోల్ ఫ్రీడమ్ పాస్ ద్వారా దేశంలోని ఏదైనా జాతీయ రహదారిపైనైనా ప్రయాణించవచ్చు. కాగా ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ పథకం ఇంకా అమలు కాలేదు.
ఈ వార్షిక పాస్ వాణిజ్యేతర ప్రైవేటు వాహనాలకు మాత్రమే. అంటే.. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్- కమర్షియల్ ప్రైవేటు వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. ఈ వాహనాలకు ఇప్పటికే ఫాస్టాగ్ యాక్టివ్‌గా ఉండాలి. వాహన విండ్‌షీల్డ్‌పై అతికించి ఉండాలి. దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై నిరంతరాయంగా, చౌకగా ప్రయాణించేందుకు వీలుగా ఈ పాస్ ను ఏర్పాటు చేశారు. ఈ ఫాస్టాగ్ వార్షిక పాస్ ఆగస్ట్ 15వ తేదీ నుంచి రాజ్ మార్గ్ యాత్ర యాప్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వెబ్సైట్, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ (MORDH) వెబ్సైట్ ల లో అందుబాటులో ఉంటుంది. ఒకే సులభమైన లావాదేవీ ద్వారా టోల్ చెల్లింపు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
ఈ పథకం డబ్బు, సమయాన్ని ఆదా చేస్తుంది. 200 టోల్ పాయింట్లు దాటిన తర్వాత ఒక్కో టోల్‌కు రూ. 15 మాత్రమే వసూలు చేస్తారు. టోల్ దగ్గర ట్రాఫిక్‌లో గంటల తరబడి ఉండాల్సిన అవసరం ఉండదు. మళ్లీ మళ్లీ వాలెట్‌ని రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు. జాతీయ రహదారిపై ఉన్న అన్ని టోల్ ప్లాజాల వద్ద ఈ సౌకర్యాన్ని కల్పించనున్నారు.