కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివారులో అన్నదాతలు చేస్తున్న ఆందోళన కొనసాగుతున్నాయి. ఆ మూడు చట్టాలను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కేంద్రంతో.. రైతు సంఘాలు పలు మార్లు చర్చలు జరిపినప్పటికి ఎలాంటి పురోగతి లేదు. కేంద్రం మెట్టు దిగడం లేదు.. రైతు పట్టు వీడడం లేదు. దీంతో సందిగ్థత అలాగే కొనసాగుతోంది. గత 18 రోజులుగా నిరసనలు చేస్తున్న కేంద్రం దిగిరాకపోవడంతో.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాయి రైతు సంఘాలు.
డిసెంబర్ 19 లోపు డిమాండ్లను అంగీకరించకపోతే నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. గురు తేజ్ బహదూర్ వర్థంతి రోజు నుంచే నిరాహార దీక్షలు ప్రారంభిస్తామన్నారు. పంజాబ్ రైతులకు మద్దతుగా ఆదివారం ఉదయం రాజస్థాన్‌లోని షాజహాన్‌పూర్ నుంచి ట్రాక్టర్ మార్చ్ నిర్వహించనున్నట్లు రైతులు ప్రకటించారు. అలాగే జైపూర్-ఢిల్లీ జాతీయ రహదారిని దిగ్భందిస్తామని రాజస్థాన్ రైతులు ప్రకటించారు. తమ పోరాటం శాంతియుతంగా కొనసాగుతోందని. కొత్త చట్టాలు రద్దు చేసే వరకు ఆందోళన విరమించబోమని తెగేసి చెప్పారు.