రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఇది తప్పనిసరి
వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పథకాలను అర్హులైన రైతులకే అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 'ఫార్మర్ రిజిస్ట్రీ' తీసుకొచ్చింది.
By - అంజి |
పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఇది తప్పనిసరి
వ్యవసాయ రంగంలో ప్రభుత్వ పథకాలను అర్హులైన రైతులకే అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 'ఫార్మర్ రిజిస్ట్రీ' తీసుకొచ్చింది. ఏపీ, తెలంగాణల్లో దీని కోసం నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. పీఎం కిసాన్, ఫసల్ బీమా, ఇతర కేంద్ర పథకాల ప్రయోజనాలు పొందాలంటే 'ఫార్మర్ రిజిస్ట్రీ' తప్పనిసరి. దీని ఎలా, ఎక్కడ నమోదు చేసుకోవాలి? ఏ పత్రాలు అవసరం. ఈ ప్రక్రియ వల్ల రైతులకు ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫార్మర్ రిజిస్ట్రీ ఎక్కడ నమోదు చేస్తారు.
తెలంగాణలోని ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను రైతు వేదికలో వ్యవసాయ విస్తరణా అధికారి ద్వారా ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. మీ సేవ కేంద్రాల్లో రూ.15 చెల్లిస్తే నమోదు చేస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో సచివాలయంలో రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించాలి. దీని కోసం ఆధార్ కార్డు, భూమి పాస్‌బుక్, ఆధార్ లింక్ ఉన్న మొబైల్ నంబర్ ఉండాలి. వీటిని తీసుకొని రైతులు పైన సూచించిన కేంద్రాలకు వెళ్లాలి.
ఫార్మర్ రిజిస్ట్రీ వల్ల లాభాలు
కేంద్రం అమలు చేసే పథకాల లబ్ధి పొందాలంటే రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి. పెట్టుబడి సాయం పీఎం కిసాన్ అందాలన్నా, పంటల బీమా ఫసల్ బీమా నిధులు జమ కావాలన్నా, ఎరువుల రాయితీలు, పంట రుణాలు పొందాలన్నా ఈ 11 అంకెల విశిష్ఠ నెంబర్ ఉండాల్సిందే. భవిష్యత్తులో రాష్ట్రం నుంచి అమలయ్యే పథకాల లబ్ధిని అన్నదాతలు పొందాలన్నా 'ఫార్మర్ రిజిస్ట్రీని' తప్పనిసరి చేసే అవకాశం ఉంది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాల లబ్ధిని ఈ రిజిస్ట్రీతో సులభంగా పొందొచ్చు. పీఎం కిసాన్‌కు ఫార్మర్ ఐడీ తప్పనిసరి. రైతుల వివరాలు కచ్చితంగా నమోదై ఉండటం వల్ల అర్హులకే సర్కార్ పథకాల ఫలాలు అందుతాయి. నిధుల జమలో పారదర్శకత పెరుగుతుంది. బీమా, సబ్సిడీ, రుణాలు త్వరగా రైతులకు చేరతాయి. ఒకే ఐడీతో ప్రభుత్వ సాయం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది. భవిష్యత్తులో మరిన్ని పథకాల అమలును ఈ ఐడీ సులభతరం చేస్తుంది.