ప్రేమ లేఖలు రాయొద్దని అంటున్న రైతు సంఘాల నేతలు

Farmers Ask Govt To Come Up With Proposal, Not 'Love Letters'. నూతన వ్యవసాయ చట్టాల మీద రైతులు కేంద్ర ప్రభుత్వం మీద

By Medi Samrat  Published on  24 Dec 2020 10:15 AM GMT
ప్రేమ లేఖలు రాయొద్దని అంటున్న రైతు సంఘాల నేతలు

నూతన వ్యవసాయ చట్టాల మీద రైతులు కేంద్ర ప్రభుత్వం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే..! కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది రైతు సంఘాలకు ఏ మాత్రం నచ్చడం లేదు. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం లేఖలు రాస్తూ ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై తమకు ఎటువంటి ఉపయోగం లేదని రైతు సంఘాల నేతలు చెప్పుకొచ్చారు. తమను చర్చలకు ఆహ్వానించడానికి ప్రేమలేఖలను రాయడం ఇకనైనా మానుకోవాలని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు కేంద్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న సవరణలను ఎప్పుడో తిరస్కరించామని.. ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కొత్త చట్టాలను రద్దు చేయాలన్న తమ డిమాండ్‌లో ఎలాంటి మార్పు లేదని తేల్చిచెప్పారు.

శాంతియుతంగా, చట్టబద్ధంగా గత నెలరోజులకు పైగా రైతులు చేస్తున్న పోరాటానికి వేర్పాటువాదులు, ఉగ్రవాదులు నాయకత్వం వహిస్తున్నారని ఆరోపించడం ద్వారా కేంద్రం దేశవ్యాప్తంగా మద్దతిస్తున్న రైతులపై బురద చల్లే కార్యక్రమాన్ని కేంద్రం పనిగట్టుకుని చేపడుతున్నట్లు కనిపిస్తోందని అన్నారు. ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించి లిఖితపూర్వకమైన ఒక సరైన ప్రతిపాదనతో చర్చలకు ముందుకు రావాలని రైతు సంఘాల నేతలు కోరారు. సవరణలను రైతులు వ్యతిరేకిస్తున్నారని ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లామని రైతు సంఘం నేత శివకుమార్‌ కక్కా బుధవారం చెప్పారు.

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళన కొనసాగిస్తున్న రైతులతో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ఫోన్‌ ద్వారా మాట్లాడారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(టీఎంసీ) రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే ఐదుగురు టీఎంసీ ఎంపీలు డెరెక్‌ ఓ బ్రెయిన్, శతాబ్ది రాయ్, ప్రసూన్‌ బెనర్జీ, ప్రతిమా మండల్, నదీమ్‌ ఉల్‌ హక్‌ ఢిల్లీలో రైతులను స్వయంగా కలిశారు. వారి పోరాటానికి సంఘీభావం ప్రకటించారు.

వ్యవసాయ రంగంలో సంస్కరణలను ప్రభుత్వం కొనసాగిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ చెప్పారు. ఈ రంగంలో చాలా అంశాల్లో ఇంకా సంస్కరణలు చేపట్టాల్సి ఉందన్నారు. మూడు కొత్త సాగు చట్టాలపై రైతుల సందేహాలను నివృత్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. నూతన సాగు చట్టాలపై ప్రభుత్వం, రైతు సంఘాల మధ్య ఇప్పటిదాకా ఐదుసార్లు చర్చలు జరగ్గా, అవన్నీ విఫలమయ్యాయి. మరోవైపు కొన్ని రైతు సంఘాలు కొత్త చట్టాల విషయంలో ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నాయి. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎన్జీవోస్‌ ఆఫ్‌ రూరల్‌ ఇండియా సదస్సులో తోమర్‌ పేర్కొన్నారు. ప్రధాని మోదీ డిసెంబర్‌ 25న దేశంలోని 9 కోట్ల మంది రైతులను ఉద్దేశించి ఉపన్యసించనున్నారు. వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వ విధానాన్ని మరోమారు వెల్లడించనున్నారు. ఆన్‌లైన్‌లో జరిగే ఈ సమావేశంలో ఆరు రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన రైతులు పాల్గొంటారు.
Next Story
Share it