చిన్న, సన్నకారు రైతులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్‌న్యూస్ చెప్పింది. ఎలాంటి తనఖా లేకుండా రైతులు తీసుకునే వ్యవసాయ రుణాల పరిమితిని రూ.1.6 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచుతున్నట్టు ఆర్‌బీఐ గవర్నర్ వెల్లడించారు. ఇది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. పెట్టుబడి ఖర్చులు, ద్రవ్యోల్బణం, ఇతర అంశాల ఆధారంగా రుణపరిమితిని సవరించినట్టు చెప్పారు. ఫిబ్రవరి 2019లో ఆర్‌బీఐ పూచీకత్తు లేని వ్యవసాయ రుణాల పరిమితిని అప్పటికి ఉన్న రూ.1 లక్ష నుండి రూ.1.6 లక్షలకు పెంచింది.
రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి ఇది సహాయపడనుందని కేంద్రం పేర్కొంది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకారం, పెరుగుతున్న వ్యవసాయ ఖర్చుల మధ్య చిన్న, సన్నకారు రైతులను ఆదుకునే లక్ష్యంతో ఈ చర్య తీసుకుంది. "ఈ చర్య చిన్న, సన్నకారు భూస్వాములైన 86 శాతం మంది రైతులకు గణనీయంగా ప్రయోజనం చేకూరుస్తుంది" అని ప్రకటన పేర్కొంది. మార్గదర్శకాలను వేగంగా అమలు చేయాలని, కొత్త రుణ నిబంధనలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని బ్యాంకులకు సూచించింది.