కర్ణాటక రాష్ట్రంలో నకిలీ ఆర్టీ పీసీఆర్ సర్టిఫికెట్ ఘటన వెలుగు చూసింది. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి ఓమిక్రాన్ పాజిటివ్ అని తేలింది. కాగా అతడికి నకిలీ ఆర్టీ పీసీఆర్ సర్టిఫికెట్ జారీ చేయడంతో అతడు దేశం విడిచి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా నలుగురిని కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో పని చేస్తున్న ఇద్దరితో పాటు సాప్ట్‌వేర్ కంపెనీలో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకును్నారు. వీరే దక్షిణాఫ్రికా పౌరుడికి నకిలీ ఆర్టీ పీసీఆర్ సర్టిఫికెట్ అందించారని పోలీసులు అనుమానిస్తున్నారు.
భారత్‌లో ఓమిక్రాన్ బారిన పడ్డ తొలి వ్యక్తి ఒక విదేశీయుడు. గత నెల 20వ తేదీన దక్షిణాఫ్రికా నుండి బెంగళూరు వచ్చాడు. అతడికి ఎయిర్‌పోర్టులో కరోనా సోకినట్లు పరీక్షల్లో తేలింది. వెంటనే అతడి నమూనాలను సేకరించిన అధికారులు.. వాటిని జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు. అక్కడ అతడికి ఓమిక్రాన్ వేరియంట్ సోకినట్లు తేలింది. ఆ తర్వాత ఓమిక్రాన్ బాధితుడిని ఓ హోటల్‌లో క్వారంటైన్ చేయగా.. సదరు పౌరుడు నకిలీ ఆర్టీ పీసీఆర్ సర్టిఫికెట్ సంపాదించాడు. అది చూపించి.. దుబాయి మీదుగా దక్షిణాఫ్రికాకు వెళ్లిపోయాడు. నకిలీ ఆర్టీపీసీఆర్ సర్టిఫికెట్‌ను తయారు చేసిన ల్యాబ్‌ను పోలీసులు ప్రశ్నించారు. దీంతో ఈ ఉదంతం బయటపడింది. దక్షిణాఫ్రికా పౌరుడితో 24 మందితో కాంటాక్ట్ కలిగి ఉన్నారు. కాగా వారందరికీ పరీక్షలు జరుపగా నెగిటివ్ వచ్చింది.