మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఆస్పత్రిలో చేరారు. ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో ముంబైలోని రిలయన్స్ ఆసుపత్రిలో చేరారు. సమాచారం ప్రకారం.. ఉదయం ఆయన గుండె నొప్పితో కొంత అసౌకర్యానికి గురైనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆసుపత్రిలో ఆయనను పరీక్షించిన వైద్యులు యాంజియోప్లాస్టీ చేయాలని నిర్ణయించారు. ఆయన గుండెలో అడ్డంకులు ఉన్నట్లు.. ఈరోజే యాంజియోప్లాస్టీ చేయాలని వైద్యులు నిర్ణయించినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.
ఉద్ధవ్ ఠాక్రే మొదటిసారిగా 20 జూలై 2012న యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. ఆ తర్వాత ఆయన ఈ ఏడాది నవంబర్‌లో యాంజియోప్లాస్టీ చేయించుకోవలసి వచ్చింది. అక్టోబర్ 12న జరిగిన దసరా ర్యాలీ తర్వాత ఉద్ధవ్ ఠాక్రే అస్వస్థతకు గురయ్యారని చెబుతున్నారు. అంతకుముందు 2016లో కూడా థాకరే ముంబైలోని లీలావతి హాస్పిటల్ లో యాంజియోగ్రఫీ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన రిలయన్స్ ఆసుపత్రిలో చేరగా.. ఈరోజే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావచ్చని సమాచారం.