మానవ జీవితం ముగియడానికి క్షణకాలం సరిపోతుంది. అప్పటి వరకు చలాకీగా ఉండే వారు అకస్మాత్తుగా కన్నుమూసే షాకింగ్ పరిణామాలు ఎన్నో చూసుంటాం. తాజాగా అలాంటి ఘటనే మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఓ మాజీ ఎమ్మెల్యే అప్పటి వరకు ఎంతో ఉల్లాసంగా ఉన్నారు. దేవాలయంలో పూజలు కూడా నిర్వహించారు. ప్రదర్శనలు చేస్తూ కుప్పకూలి చనిపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. బైతూల్ మాజీ ఎమ్మెల్యే, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మాజీ కోశాధికారి అయిన వినోద్ డాగా ధన్‌తేరాస్ సందర్భంగా జైన్ దాదావాడీ (జైన్ టెంపుల్)ఆలయంలో పూజ చేసేందుకు వెళ్లారు. ఆలయంలోని పార్శ్వనాథునికి పూజలు నిర్వహించిన ఆయన ఆ తర్వాత గురుదేవ్ మందిరంలో ప్రదక్షిణలు చేసి పూజలు నిర్వహించారు. గురుదేవ్ పాదాలకు నమస్కరించి, పక్కకు జరిగిన కొన్ని క్షణాల్లోనే కార్డియాక్ అరెస్ట్ కారణంగా కుప్పకూలిపోయారు. అదే సమయంలో ఆలయంలోకి వచ్చిన బాలుడు వినోద్ డాగా అచేతనంగా పడి ఉండడాన్ని చూసి పూజారికి చెప్పాడు.
అప్రమత్తమైన పూజారి, ఇతర భక్తులతో కలిసి ఆయనను లేపే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.