ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత భూపేష్ బఘెల్ ఇంటిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు చేపట్టింది. భిలాయ్‌లోని ఆయన నివాసంపై ఉదయం నుంచి ఈడీ సోదాలు చేస్తోంది. భూపేష్ బఘేల్ ఇంటితో పాటు మరో 14 చోట్ల కేంద్ర ఈడీ సోదాలు జరుపుతుంది.
భూపేష్ బాఘేల్ కుమారుడు చైతన్య బాఘేల్ ఇంటిలో కూడా ఈడీ సోదాలు జరుపుతుందని వార్తలు వస్తున్నాయి. ఆర్థిక అవకతవకలు, మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది.
భిలాయ్ 3 మానసరోవర్ కాలనీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ బంగ్లాలో ఈడీ బృందం సోదాలు చేపట్టింది. ఉదయం 7:00 గంటలకు మూడు ఇన్నోవా కార్లలో ఈడీ బృందం భూపేష్ బఘేల్ ఇంటికి వచ్చింది. బంగ్లా లోపల ED సోదాలు జరుగుతున్నాయి. అయితే.. కాంగ్రెస్ కార్యకర్తలు భూపేష్ బఘేల్ ఇంటి బయట గుమిగూడారు.
ఈడీ సోదాల నేపథ్యంలో భద్రత కోసం హాజరైన సిఆర్‌పిఎఫ్ జవాన్లకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. మీడియా సిబ్బంది కవరేజీని కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. అయితే కాసేపటి తర్వాత వాతావరణం సద్దుమణిగింది. కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ ప్రభుత్వానికి, ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.