ఈపీఎఫ్ వడ్డీ రేటు విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
EPF subscribers to get 8.50% rate of interest for 2020-21. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) వడ్డీ రేటుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది
By Medi Samrat Published on 5 March 2021 3:54 AM GMT
ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) వడ్డీ రేటుపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2020 21 ఆర్థిక సంవత్సరానికి గానూ ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీరేటును 8.5 శాతంగా నిర్ణయిస్తూ నిర్ణయం తీసుకుంది. శ్రీనగర్‌లో జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేటును తగ్గించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే గతేడాది ఉన్న రేటునే యథాతథంగా కొనసాగించడంతో ఏకంగా 6 కోట్ల మంది ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నిర్ణయించిన వడ్డీపై ఈపీఎఫ్ఓకు చెందిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నిర్ణయం తీసుకుంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ డిపాజిట్లపై 8.65 శాతం వడ్డీ వర్తిస్తుంది. 8.65 శాతంగా ఉన్న వడ్డీరేటును ఈసారి కూడా కొనసాగిస్తారన్న వార్తలొచ్చాయి.
కానీ వడ్డీ రేటును 15 బేసిస్ పాయింట్స్ తగ్గించింది ఈపీఎఫ్ఓ.కోవిడ్ 19 కారణంగా ఉద్యోగులు తమ ఖాతాల నుంచి భారీగా నగదును ఉపసంహరించుకున్నారు. అదే సమయంలో డిపాజిట్లు తగ్గిపోయాయి. గత ఏడాది డిసెంబరు వరకూ దాదాపు 2 కోట్ల మంది ఈపీఎఫ్‌వో వినియోగదారులు రూ.73వేల కోట్లను వెనక్కి తీసుకున్నారని అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. 2019-20 సంవత్సరానికి వడ్డీ రేటును 8.5 శాతంగా ప్రకటించారు. దాన్నే కొనసాగిస్తూ తాజాగా జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.