రాష్ట్రంలోని అర్హులైన ప్రజలు తమ పేర్లు ఓటర్ల జాబితాలో ఉండేలా చూసుకోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం కోరారు. కోల్‌కతాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన భూ పంపిణీ కార్యక్రమానికి హాజరైన మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ఫ్లైఓవర్ నిర్మాణం సాకుతో రైల్వే అధికారులు ఎలాంటి పరిహారం ఇవ్వకుండా ప్రజలను ఖాళీ చేయించారని విన్నాను. పేద ప్రజలను ఖాళీ చేయించలేరు. పశ్చిమ బెంగాల్‌లోని శరణార్థులను వెళ్లగొట్టడానికి నేను ఎవరినీ అనుమతించనని అన్నారు. మీ భూమిని బలవంతంగా లాక్కుంటే.. రాష్ట్రం మీ వెంటే ఉంటుందని గుర్తుంచుకోవాలని బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ ప్రజలకు చెప్పారు.
ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో నిర్ధారించుకోండి.. లేకపోతే.. మిమ్మల్ని NRC పేరుతో నిర్బంధ శిబిరాలకు పంపుతారు. అది అవమానం, అవమానం, అవమానం అని మమతా బెనర్జీ అన్నారు. 100 రోజుల పనికి కేంద్రం నిధులు విడుదల చేయడం లేదని ఆమె ఆరోపించారు. కేంద్రం నుంచి రైతులకు ఎరువులు అందడం లేదని.. వారికి లేఖ కూడా పంపామని, సహాయనిరాకరణ ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో సొంతంగానే ఎరువుల తయారీపై ఆలోచించాల్సి వస్తుందని మమతా బెనర్జీ అన్నారు. కార్యక్రమంలో అన్ని జిల్లాలకు చెందిన 4,701 పేద కుటుంబాలకు సీఎం మమతా బెనర్జీ భూమి 'పట్టా'లను అందజేశారు.