హైదరాబాద్ బిరియానీకి ఎలా ఫేమస్ అయిందో.. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో నగరం కబాబ్ కు ఫేమస్ అని చెప్పొచ్చు. కబాబ్‌లు, తందూరీ వంటకాలకు ప్రసిద్ధి చెందిన లక్నోలో.. బొగ్గుతో సాధారణంగా తందూరీలను తయారు చేస్తారు.. అయితే ఇకపై గ్యాస్‌తో నడిచే వాటి వైపు వెళ్లాలని అధికారులు సూచించడంతో రుచికరమైన తందూరీ ఇకపై దొరకడం కష్టమేనని అంటున్నారు.
లక్నోలో వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి గ్యాస్ తందూరీ మెషీన్ లను ఉపయోగించాలని.. నగర పౌర సంఘం ప్రతిపాదించింది. 2,000 కంటే ఎక్కువ చోట్ల బొగ్గులపై తందూరీ తయారీ చేస్తున్నారు. గాలిలో నాణ్యత తక్కువగా ఉందని.. ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ అధ్యయనం ద్వారా కనుగొన్నారు.. అందుకే గ్యాస్ తందూరీ మెషీన్ లకు మారమని మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నామని మునిసిపల్ కమీషనర్ ఇందిరజిత్ సింగ్ చెప్పారు.
అయితే దీన్ని తందూరీ కబాబ్ సెంటర్ల నిర్వాహకులు తప్పుబడుతూ ఉన్నారు. చాలా మంది బొగ్గులపై తందూరీ చేయడం.. కేవలం వంట పద్ధతి మాత్రమే కాదని.. మంచి రుచి రావడంలో కీలకమైన అంశం ఇదేనని చెబుతున్నారు.