అసెంబ్లీ ఆవరణలో మద్యం సీసాలు.. ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సిందే..

Empty Liquor Bottles On Bihar Assembly Campus Spark Tejashwi Yadav Attack. మద్య నిషేధం అమల్లో ఉన్న బీహార్‌లో అసెంబ్లీ ఆవరణలో

By Medi Samrat  Published on  30 Nov 2021 5:53 PM IST
అసెంబ్లీ ఆవరణలో మద్యం సీసాలు.. ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సిందే..

మద్య నిషేధం అమల్లో ఉన్న బీహార్‌లో అసెంబ్లీ ఆవరణలో ఖాళీ మద్యం సీసాలు కనిపించాయి. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేశారు. విధానసభ ఆవరణలో ఖాళీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకోవడంపై అధికార JDU-BJP ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మద్యంపై రాష్ట్రంలో పూర్తిస్థాయిలో నిషేధం విధించాలని.. ఇది చాలా తీవ్రమైన విషయమని తేజస్వీ యాదవ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం సీసాలు కనిపిస్తున్నాయని.. పూర్తిగా మద్యాన్ని నిషేధించాలని కోరారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందిస్తూ.. ఇది చాలా తీవ్రమైన విషయమని, దీనిపై దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. స్పీకర్ అనుమతిస్తే ముఖ్యకార్యదర్శి, డీజీపీని దర్యాప్తు కోరుతామని అన్నారు.

మద్య నిషేధానికి అనుకూలంగా ముఖ్యమంత్రి నేతృత్వంలోని నాలుగు నియోజకవర్గాల శాసనసభ్యులు ప్రతిజ్ఞ చేసిన తర్వాతి రోజే ఈ మద్యం సీసాలు బయటకు వచ్చాయి. రాష్ట్రంలో మద్యం మాఫియాను నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని.. మద్య నిషేధాన్ని 'కంటితుడుపు'గా తేజస్వీయాదవ్ అభివర్ణించారు. "ఇది చాలా పెద్ద సమస్య. అసెంబ్లీ ఆవరణలో మద్యం ఉంటే ముఖ్యమంత్రి పదవిలో ఉండే నైతిక బాధ్యత ఉండదు. ఎవరు బాధ్యులు. అక్కడ కోకాకోలా సీసాలు (కూడా) ఉన్నాయి. బీహార్ హోం మంత్రి నిద్రపోతున్నారా?'' అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రశ్నించారు. మద్యం బాటిళ్లు దొరికిన ఈ ప్రదేశం ముఖ్యమంత్రి ఛాంబర్‌కు 100 మీటర్ల కంటే తక్కువ దూరంలో ఉందని ఆయన మండిపడ్డారు. గత నెలలో పశ్చిమ చంపారన్, గోపాల్‌గంజ్, ముజఫర్‌పూర్ మరియు సమస్తిపూర్ జిల్లాల్లో నకిలీ మద్యం సేవించి 40 మందికి పైగా మరణించారు. ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశంలో, పోలీసు అధికారులు నిషేధాన్ని అమలు చేయడంలో అలసత్వం వహిస్తే కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.


Next Story