ఎలుకల కారణంగా ఎక్స్‌ప్రెస్ వే పై గుంత పడిందట..!

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్ట్‌లో భాగమైన ఒక ఉద్యోగి రోడ్డుపై గుంతలు పడడానికి ఎలుకలు కారణమని చెప్పి అందరినీ షాక్ కు గురి చేశాడు

By Medi Samrat  Published on  19 Sep 2024 8:48 AM GMT
ఎలుకల కారణంగా ఎక్స్‌ప్రెస్ వే పై గుంత పడిందట..!

ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్ట్‌లో భాగమైన ఒక ఉద్యోగి రోడ్డుపై గుంతలు పడడానికి ఎలుకలు కారణమని చెప్పి అందరినీ షాక్ కు గురి చేశాడు. రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో రహదారిపై గుంతలకు ఎలుకల కారణమని చెప్పిన అతడిని విధుల నుండి తొలగించారు. KCC బిల్డ్‌కాన్‌లో ఉద్యోగి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రాజెక్ట్‌కి సంబంధించి సాంకేతిక అవగాహన లేని ఒక జూనియర్ ఉద్యోగి ఈ వ్యాఖ్యలు చేశాడని, అతన్ని కంపెనీ నుండి తొలగించామని సంస్థ వివరణ ఇచ్చింది. ముఖ్యంగా ఆ ఉద్యోగి మెయింటెనెన్స్ మేనేజర్ కాదని కంపెనీ నేషనల్ హైవే అథారిటీకి పంపిన లేఖలో తెలిపింది.

దౌసాలోని ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్ట్ డైరెక్టర్ బల్వీర్ యాదవ్ మాట్లాడుతూ నీటి లీకేజీ కారణంగా రహదారిపై గుంతలు పడ్డాయని తెలిపారు. కాంట్రాక్టర్‌కు ఈ విషయం గురించి సమాచారం అందిన వెంటనే మరమ్మతులు చేసినట్లు యాదవ్ తెలిపారు. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే 1,386 కిలోమీటర్లు ఉంటుంది. ఇది దేశంలోనే అతి పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే. రెండు నగరాల మధ్య ప్రయాణ సమయాన్ని 24 గంటల నుండి కేవలం 12-13 గంటలకు తగ్గించాలనే లక్ష్యంతో ఈ ఎక్స్ప్రెస్ వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

Next Story