దేశంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్స్ వచ్చేస్తున్నాయ్..!

Emergency Landing Field. భారత వైమానిక దళం విమానాల కోసం గురువారం జాతీయ రహదారి 925 లో సత్తా-గాంధవ్

By Medi Samrat  Published on  9 Sep 2021 2:56 PM GMT
దేశంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్స్ వచ్చేస్తున్నాయ్..!

భారత వైమానిక దళం విమానాల కోసం గురువారం జాతీయ రహదారి 925 లో సత్తా-గాంధవ్ స్ట్రెచ్‌లో అత్యవసర ల్యాండింగ్ స్ట్రిప్‌ను కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్ మరియు నితిన్ గడ్కరీ ప్రారంభించారు. సీ-130జే సూప‌ర్ హెర్క్యుల‌స్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ, ఎయిర్ చీఫ్ మార్ష‌ల్ ఆర్కేఎస్ బ‌దౌరియా ప్రయాణించారు. రాజ‌స్థాన్‌లోని జాలోర్‌లో ఉన్న నేష‌న‌ల్ హైవేపై ఎమ‌ర్జెన్సీ ఫీల్డ్ ల్యాండింగ్‌ ప్రాంతంలో విమానం ల్యాండ్ అయింది. ఎమ‌ర్జెన్సీ ఫీల్డ్ ల్యాండింగ్ ప్రారంభోత్స‌వంలో భాగంగా జ‌రిగిన ల్యాండింగ్‌ అని అధికారులు తెలిపారు.

భారత వైమానిక దళం విమానాల అత్యవసర ల్యాండింగ్ కోసం ఉపయోగించబడనున్న భారతదేశపు మొదటి జాతీయ రహదారిగా NH-925 నిలిచింది. గురువారం నాడు NH-925 యొక్క అత్యవసర ల్యాండింగ్ సౌకర్యం పై మరికొన్ని విమానాల కార్యకలాపాలను మంత్రులు దగ్గర ఉండి చూశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఈ ముగ్గురితోపాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జ‌న‌ర‌ల్ బిపిన్ రావ‌త్ కూడా పాల్గొన్నారు. ఇది రక్షణ పరంగా భారత్ కు ఎంతో స్పెషల్ ల్యాండింగ్ అని అధికారులు తెలిపారు.

దేశంలో 20 ప్రాంతాల్లో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్స్‌ను జాతీయ హైవే సంస్థ నిర్మిస్తున్న‌ట్లు ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. జాలార్‌లో ఉన్న ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్ వ‌ద్ద‌.. మూడు హెలిప్యాడ్ల‌ను కూడా నిర్మించిన‌ట్లు మంత్రి చెప్పారు. అంత‌ర్జాతీయ బోర్డ‌ర్ వ‌ద్ద ల్యాండింగ్ ఫీల్డ్ ఉండ‌డం భార‌త్ సంసిద్ధ‌త‌ను చూపుతుంద‌ని, దేశ ఐక్య‌త‌, స‌మ‌గ్ర‌త‌ను కాపాడుకోవచ్చని అన్నారు. హైవేల‌పై అనేక చోట్ల హెలిప్యాడ్ల‌ను కూడా నిర్మిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. ఇదో గొప్ప ఘ‌న‌త అన్నారు. ఆర్మీ సామ‌ర్థ్యాన్ని పెంచేందుకు నేష‌న‌ల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్స్‌ను డెవ‌ల‌ప్ చేస్తున్న‌ట్లు రాజ్‌నాథ్ చెప్పారు. ఎమ‌ర్జెన్సీ ఫీల్డ్స్‌ను ప్ర‌కృతి విపత్తు స‌మ‌యంలో రెస్క్యూ ఆప‌రేష‌న్స్ కోసం కూడా వాడ‌నున్న‌ట్లు తెలిపారు.


Next Story