5 రాష్ట్రాలలో మోగనున్న ఎన్నికల నగారా..
Election Commission to announce poll dates for 5 states. బంగాల్, కేరళ సహా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి
By Medi Samrat Published on 26 Feb 2021 2:15 PM ISTబంగాల్, కేరళ సహా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికల నగారా మోగనుంది. శుక్రవారం సాయంత్రం 4.30గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. కేరళ, బంగాల్, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. ఇందుకోసం ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పర్యటించి.. పరిస్థితులను పర్యవేక్షించింది.
బంగాల్లో ఎన్నికల పరిణామాలు క్షణక్షణం ఉత్కంఠను తలపిస్తున్నాయి. బంగాల్ అసెంబ్లీలో 294 స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ వరుసగా రెండోసారి జయకేతనం ఎగురవేసింది. ఈ ఏడాది ఎన్నికల్లోనూ విజయం సాధించి హాట్రిక్ కొట్టేయ్యాలని దీదీ భావిస్తున్నారు. 140 స్థానాలున్న కేరళ 14వ శాసనసభ గడువు జూన్ 1వ తేదీన ముగియనుంది. గత ఎన్నికల్లో వామపక్షాల నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్.. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌పై భారీ మెజార్టీతో విజయం సాధించింది.
తమిళనాడులో 15వ శాసనసభ గడువు మే 24తో ముగియనుంది. 234 సీట్లున్న రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుతం అన్నాడీఎంకే అధికారంలో ఉంది. మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత జైలుకెళ్లిన ఆమె నెచ్చెలి శశికళ ఇటీవలే విడదలయ్యారు. దీంతో అక్కడి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈశాన్య రాష్ట్రం అసోంలోనూ త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ప్రస్తుత శానసనభ గడువు ఏప్రిల్‌లో ముగియనుంది. తరుణ్ గొగొయ్ నేతృత్వంలో సుదీర్ఘంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న అసోంలో గత ఎన్నికల్లో భారీ మార్పు చోటుచేసుకుంది. తొలిసారిగా ఆ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగిరింది.
ఈ నాలుగు రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరికి కూడా త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. పుదుచ్చేరి శాసనసభ గడువు మే వరకు ఉంది. అయితే ఇటీవల అక్కడ నారాయణ స్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు కుప్పకూలింది. ఎమ్మెల్యేల వరుస రాజీనామాలతో శాసనసభలో కాంగ్రెస్ బలం తగ్గింది. దీంతో బలనిరూపణలో విఫలమైన నారాయణస్వామి సీఎం పదవికి రాజీనామా చేశారు.