దేశం.. పెను ముప్పు నుండి బయటపడిందా.?
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) సోమవారం నాలుగు రాష్ట్రాల్లోని 19 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది.
By Medi Samrat Published on 18 Dec 2023 7:07 PM ISTనేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) సోమవారం నాలుగు రాష్ట్రాల్లోని 19 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. నిషేధిత ఇస్లామిక్ స్టేట్ టెర్రర్ ఆర్గనైజేషన్ ఐసిస్ కు చెందిన ఎనిమిది మంది కార్యకర్తలను అరెస్టు చేసింది. కర్ణాటక, మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీలోని 19 ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. ఉగ్రవాద నెట్‌వర్క్‌లోని అనుమానితుల ఇండ్లలో ఎన్ఐఏ అధికారులు తనిఖీచేశారు. కర్ణాటకలోనే 11 ప్రాంతాల్లో దాడులు చేయగా, జార్ఖండ్‌లో నాలుగు, మహారాష్ట్రలో మూడు, ఢిల్లీలో ఒక ప్రాంతంలో సోదాలు నిర్వహించారు.
ఐసిస్‌కు చెందిన 8 మంది ఉగ్రవాదులను ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ విధ్వంసం సృష్టించాలన్న ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు. మినాజ్ అలియాస్ మహ్మద్ సులేమాన్ అనే ఉగ్రవాది నేతృత్వంలో దేశంలో పేలుళ్లకు కుట్ర జరిగినట్లు ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. అరెస్టయిన 8 మంది ఉగ్రవాదుల్లో వారి నాయకుడు మహ్మద్ సులేమాన్ కూడా ఉన్నాడు. పట్టుబడిన ఉగ్రవాదుల పేర్లను ఎన్‌ఐఏ వెల్లడించింది. వారిలో మినాజ్ అలియాస్ మహ్మద్ సులేమాన్, సయ్యద్ సమీర్ ఇద్దరూ బళ్లారిలో పట్టుబడ్డారు. అనాస్ ఇక్బాల్ షేక్ ముంబైలో.. మహ్మద్ మునీరుద్దీన్, సయీద్ సమీయుల్లా అలియాస్ సమీ, మహ్మద్ ముజామిల్ బెంగళూరులో అధికారులకు చిక్కారు. షయాన్ రెహ్మాన్ అలియాస్ హుస్సేన్‌ను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. మహ్మద్ షాబాజ్ అలియాస్ జుల్ఫికర్ అలియాస్ గుడ్డూను జంషెడ్‌పూర్‌లో అరెస్ట్ చేశారు.