ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి-లక్నో ఫోర్‌లేన్ జాతీయ రహదారిపై సరోఖాన్‌పూర్, బద్లాపూర్‌లో గురువారం ఉదయం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో బస్సు డ్రైవర్, ఏడుగురు సందర్శకులు మరణించారు. ఈ ప్రమాదాల్లో దాదాపు రెండు డజన్ల మంది గాయపడ్డారు. జార్ఖండ్‌లో రిజిస్టర్ అయిన టాటా సుమో సరోఖాన్‌పూర్ వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారణాసి నుంచి లక్నో వెళ్తున్న సుమోలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. గ్రామస్తుల సహాయంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
దాదాపు అరగంట తర్వాత అదే ప్రదేశానికి 100 మీటర్ల దూరంలో భక్తులతో కూడిన బస్సు బియ్యం లోడుతో ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ మోను సింగ్, ఇద్దరు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. బస్సులో 52 మంది ఉన్నారు. రెండు వాహనాల్లో ప్రయాణిస్తున్నవారు అయోధ్యకు వెళ్తుండగా ప్రమాదాల బారిన పడ్డారు. మృతులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
మరోవైపు కాన్పూర్ దేహత్‌లో ట్రావెలర్ మినీ బస్సు టైరు పగిలిపోవడంతో అదుపు తప్పి హోటల్‌లోకి ప్రవేశించింది. ఈ ప్రమాదంలో వాచ్‌మెన్ మృతి చెందాడు. అయితే వాహనంలో ప్రయాణిస్తున్న వ్యక్తులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. మహాకుంభంలో స్నానం చేసి, అందరూ ట్రావెలర్ మినీ బస్సులో ఇండోర్‌లోని తమ ఇంటికి తిరిగి వెళ్తున్నారు.