ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును ముమ్మరం చేసింది. శుక్రవారం హైదరాబాద్ సహా దేశ వ్యాప్తంగా 40 ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీతో పాటు పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేశారు. ఢిల్లీకి చెందిన ఈడీ అధికారుల ఆధ్వర్యంలో 25 బృందాలుగా ఏర్పడి తనిఖీలు చేస్తున్నారు.
హైదరాబాదులోనే 20 చోట్ల సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, నెల్లూరులో మద్యం వ్యాపారులు, పంపిణీదారులు, సరఫరా గొలుసు నెట్‌వర్క్‌లకు సంబంధించిన ప్రాంగణాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
మరోవైపు.. ఈ కేసుకు సంబంధించి వారాల వ్యవధిలో దాడులు చేయడం ఇది రెండోసారి. గతవారం ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కర్ణాటకలో 45 చోట్ల దాడులు చేసింది. అప్పుడు ఏపీలో సోదాలు నిర్వహించని ఈడీ.. ఇప్పుడు నెల్లూరులో సోదాలు నిర్వహిస్తుండటం గమనార్హం.