ఆర్థిక సర్వే ఏం చెబుతుందంటే..
Economic Survey 2020-21 forecasts real GDP growth for FY22 at 11percent. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
By Medi Samrat
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం లోక్‌సభలో బడ్జెట్‌కు ముందు ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2021-22)లో జీడీపీ వృద్ధి రేటు 11శాతంగా ఉంటుందని ఈ ఆర్థిక సర్వే అంచనా వేసింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఆర్థిక సర్వే ఈ అంచనాకు వచ్చింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21)లో వృద్ధి రేటు -7.7 శాతంగా ఉంటుందని తెలిపింది. ఇక రికవరీ విషయానికొస్తే.. వి-షేప్డ్‌గా ఉంటుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది.
అయితే.. కరోనా కారణంగా జీడీపీ మునుపటి స్థాయిలకు చేరుకోవడానికి మరో రెండేళ్ల సమయం పడుతుందని సర్వే స్పష్టం చేసింది. ఆర్థిక వ్యవస్థ మళ్లీ సాధారణ స్థాయికి చేరుకుంటోందని.. సేవలు, వినియోగం, పెట్టుబడుల రంగాలు చాలా వేగంగా పుంజుకుంటాయని సర్వే పేర్కొంది. గతేడాది ఒక్క వ్యవసాయ రంగం తప్ప.. మిగిలిన కాంటాక్ట్ ఆధారిత సేవలు, తయారీ, నిర్మాణ రంగాలు తీవ్రంగా నష్టపోయినట్లు ఈ సర్వే తేల్చింది.
గతేడాది -23.9 శాతానికి పతనమైన వృద్ధి రేటు తర్వాత మెల్లగా కోలుకుంది. అయితే.. ఈ ఏడాది ప్రభుత్వం తన 3.5 శాతం ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరుకోకపోవచ్చని కూడా ఆర్థిక సర్వే అంచనా వేసింది.