తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ 24 గంటల పాటు నిషేధం విధించింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలపై ఆమె 24 గంటల పాటు ప్రచారంలో పాల్గొనకుండా ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా వేటు వేశారు. సోమవారం రాత్రి 8 గంటల నుంచి మంగళవారం రాత్రి 8 గంటల వరకూ ఈ నిషేధం అమల్లో ఉంటుంది. నిషేధ సమయంలో ఆమె ఏ రూపంలోనూ ప్రచారం చేయకూడదు.
ముస్లిం ఓట్లపై మమతా చేసిన వ్యాఖ్యలతో పాటు.. కేంద్ర బలగాలపై తిరుగుబాటు చేయాలని ప్రజలకు పిలుపునివ్వడం వంటి చర్యలకు పాల్పడినందుకు ఆమె ప్రచారానికి 24 గంటల పాటు తాళం వేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలపై రెండు సార్లు మమతకు ఈసీ నోటీసులు జారీ చేసింది. తాను ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడలేదని ఈసీకి సమాధానమిచ్చిన మమతా బెనర్జీ.. ప్రధాని మోదీకి ఎందుకు నోటీసులివ్వలేదంటూ ఈసీని ప్రశ్నించారు.