సోమవారం అర్థరాత్రి రాష్ట్రపతి భవన్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. దంపతులు కారులో ఉన్నారు.. రాష్ట్రపతి ఎస్టేట్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా బారికేడ్లను ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు. వెంటనే లోపల ఉన్న భద్రతా సిబ్బంది ఆ కారును అడ్డుకున్నారు. భద్రత నియమాలను ఉల్లంఘించినందుకు ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. హ్యుందాయ్ ఐ-20 కారులో రాష్ట్రపతి భవన్ లోకి వెళ్లాలని భావించారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని దంపతులపై అక్రమంగా ప్రవేశించడం, ప్రజా ఆస్తులకు నష్టం, మోటారు వాహనాల చట్టాల కింద కేసులు నమోదు చేశారు.
ఏసీపీ స్థాయి అధికారి ఫిర్యాదు మేరకు సౌత్ అవెన్యూ పోలీస్ స్టేషన్‌లో వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. రాత్రి 11:35 గంటలకు సంఘటన గురించి తమకు సందేశం అందిందని పోలీసులు తెలిపారు. దంపతులు కొన్ని బారికేడ్లను ఢీకొట్టి, ఒక గేటు నుంచి రాష్ట్రపతి భవన్‌లోకి ప్రవేశించేందుకు యత్నించారు. 'కారులో ఉన్నవారిని తరువాత శివమ్ మరియు కుసుమ్‌గా గుర్తించారు. కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఎటువంటి కారణం లేకుండా బలవంతంగా మరియు అనధికారికంగా ప్రెసిడెంట్ ఎస్టేట్‌లోకి ప్రవేశించారు. ఆర్పీ భవన్‌లోని 17వ నంబర్ గేట్ బయట మద్యం మత్తులో ఉన్న వారిని అడ్డుకున్నారు. వైద్య పరీక్షల కోసం వారిని ఆర్‌ఎంఎల్ ఆసుపత్రికి పంపారు' అని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.