ఆపరేషన్ కగార్‌లో భాగంగా తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న కర్రెగుట్టల్లో మావోయిస్టుల జాడ కోసం పోలీసు బలగాలు చేపడుతున్న కూంబింగ్ 8వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగానే కర్రెగుట్టను ఆధీనంలోకి తీసుకున్న పోలీస్ బలగాలు కూంబింగ్‌ను సాగిస్తూ ముందుకు సాగుతూనే ఏరియల్ సర్వేలో భాగంగా హెలికాప్టర్, డ్రోన్‌లతో తనిఖీలు చేపడుతున్నాయి. రాత్రింబవళ్లు సాగుతున్న ఈ కూంబింగ్‌లో కర్రెగుట్టల్లోని సొరంగాలు, గుహలు సవాల్‌గా మారినట్టు తెలుస్తుంది. కర్రెగుట్టలపై శాస్త్రీయంగా ఏర్పడిన గుహలతోపాటు మావోయిస్టులు ఏర్పర్చుకున్న సొరంగాలు అనేకం ఉన్నట్టు సమాచారం.
ఈ నేపథ్యంలోనే మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న కర్రెగుట్టల్లో వారి రహస్య స్థావరాల్లోకి భద్రతా బలగాలు చొచ్చుకెళ్లాయి. ములుగు జిల్లా వెంకటాపురం పోలీసు సర్కిల్కు సరిహద్దుగా ఉన్న నల్లరాతి(బెడెం మల్లన్న) గుట్టలో శనివారం భారీ సొరంగాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. ఒక్కొక్కరే వెళ్లగలిగేలా ఉన్న ఈ రాతి సొరంగం మార్గంలో దాదాపు 80 అడుగులు లోపలికి వెళ్లిన కోబ్రా, సీఆర్పీఎఫ్ బలగాలు విశాలంగా ఉన్న ప్రాంతాన్ని చూసి విస్తుపోయాయి.