నేను రవాణా శాఖ మంత్రిగా ఉన్నంత కాలం డ్రైవర్ లెస్ కార్లపై మరచిపోండి : నితిన్ గడ్కరీ
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి డ్రైవర్ లెస్ కార్లపై వ్యతిరేకత వ్యక్తం చేశారు.
By Medi Samrat Published on 18 Dec 2023 10:14 AM GMTకేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మరోసారి డ్రైవర్ లెస్ కార్లపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆయన సోమవారం మాట్లాడుతూ.. నేను రవాణా శాఖ మంత్రిగా ఉన్నంత కాలం మీరు డ్రైవర్ లేని కార్ల(Driverless Cars) గురించి మరచిపోండి అని అన్నారు. దీని వెనుక పెద్ద కారణాన్ని కూడా వివరించారు.
దేశంలో డ్రైవర్ లేని కార్లను నడపనివ్వబోమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ కార్యక్రమంలో అన్నారు. దీని వల్ల చాలా మంది నష్టపోతారు. డ్రైవింగ్ చేసే వృత్తిలో ఉన్నవారు.. తమ ఉద్యోగాలను కోల్పోతారు. కాబట్టి నేను ఎప్పుడూ ఇలా చేయనన్నారు. దీనిపై చాలాసార్లు నన్ను ప్రశ్నలు అడిగారని.. నేను రవాణా మంత్రిగా ఉన్నప్పటి నుండి ఇది సాధ్యం కాదని ప్రతిసారీ చెప్పానన్నారు.
అమెరికాకు చెందిన EV తయారీదారు టెస్లా భారతదేశంలో కూడా తన స్థావరాన్ని నెలకొల్పాలని కోరుకుంటోంది. ఇందుకోసం భారత్ నుంచి దిగుమతి పన్నులో మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. టెస్లా కంపెనీకి భారత్ స్వాగతం పలుకుతుందని.. అయితే కార్లను భారత్‌లోనే తయారు చేయాలని అన్నారు. చైనా నుంచి దిగుమతి ఉండదు. టెస్లాను చైనాలో తయారు చేసి భారత్‌లోకి దిగుమతి చేసుకోవడం సాధ్యం కాదని ఆయన అన్నారు.
చాలా పెద్ద పెద్ద కార్ల తయారీ కంపెనీలు డ్రైవర్‌లెస్ కార్లపై పనిచేస్తున్నాయి. దీనికి సంబంధించి అనేక దేశాల్లో విచారణలు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ కంపెనీలు తమ డ్రైవర్‌లెస్ కార్లను విడుదల చేయాలని ఆలోచిస్తున్నాయి. అయితే ఇది భారతదేశంలో సాధ్యం కాకపోవచ్చు. డ్రైవర్‌లెస్ కార్లపై భారత ప్రభుత్వం తన అభిప్రాయాలను స్పష్టం చేసింది.