ఇంత అన్నం పెడితే చాలు మనిషి కోసం ఏమైనా చేస్తాయి కుక్కలు. అందుకే కుక్కకు ఉన్న విశ్వాసం కూడా మనుషులకు లేదనే మాటలను మనం వింటూ ఉంటాం. తాజాగా ఓ కుక్క తన ఓనర్ కిడ్నాప్ అవ్వకుండా కాపాడింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మనిషికి అత్యంత నమ్మకమైన స్నేహితుడైన కుక్క తన యజమానిని కిడ్నాప్ చేయకుండా కాపాడింది. కొంతమంది దుండగులు కుక్క యజమానిని కొట్టి వ్యాన్‌లో ఎక్కించడం ప్రారంభించినప్పుడు, కుక్క వారిపై దాడి చేయడంతో నేరస్థులు పారిపోవాల్సి వచ్చింది. గ్వాలియర్‌లోని తాటిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ కాలనీలో చోటు చేసుకుంది.
ఈ విషయమై అడిషనల్ ఎస్పీ రాజేష్ దండోటియా మాట్లాడుతూ.. అశోక్ కాలనీలో నివసించే నితిన్ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ వ్యాన్‌లో నలుగురైదుగురు దుండగులు వచ్చి అతడిని కొట్టడం ప్రారంభించారు. ఆ తర్వాత వాళ్లు నితిన్‌ని బలవంతంగా వ్యాన్‌లో ఎక్కించుకుని వెళుతుండగా చూసిన పెంపుడు కుక్క ఇదంతా చూసి తన యజమానిని కాపాడేందుకు ముందుకు వచ్చింది. జర్మన్ షెపర్డ్ జాతి కుక్క దుండగులపై ఒక్కొక్కరిగా ఎగరడం ప్రారంభించింది. కుక్క దూకుడును చూసిన దుండగుల మనోధైర్యం దెబ్బతినడంతో నితిన్ ను వదిలి పారిపోయారు. కుక్క ధైర్యసాహసాలు అక్కడ అమర్చిన సీసీటీవీ కెమెరాలో కూడా రికార్డయ్యాయి. ప్రస్తుతం నితిన్ ఫిర్యాదుపై తాటిపూర్ పోలీస్ స్టేషన్‌లో నిందితులపై ఫిర్యాదు నమోదైంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులందరినీ త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.