ఢిల్లీ పేలుడు ఘటనలో కారు నడిపింది అతడే..డీఎన్‌ఏ పరీక్షలో నిర్ధారణ
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుడు కేసులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది
By - Knakam Karthik |
ఢిల్లీ పేలుడు ఘటనలో కారు నడిపింది అతడే..డీఎన్‌ఏ పరీక్షలో నిర్ధారణ
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో పేలుడు కేసులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఈ పేలుడు జరిగిన కారులో లభించిన నమూనాలను పరీక్షించగా, అవి డాక్టర్ ఉమర్ ఉన్ నబీ డీఎన్‌ఏతో పూర్తిగా సరిపోలినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ ధృవీకరించిందని జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. పేలుడు జరిగే ముందు ఉమర్ ఆ కారును నడుపుతున్న సీసీటీవీ దృశ్యాలను అధికారులు ఇప్పటికే గుర్తించిన విషయం తెలిసిందే. దీంతో పేలుడు సమయంలో అతడు కూడా వాహనంలో ఉండి ప్రాణాలు కోల్పోయి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీనిని నిర్ధారించేందుకు పుల్వామాలోని అతని కుటుంబ సభ్యుల నుంచి డీఎన్‌ఏ నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించారు.
తాజాగా వచ్చిన ఫలితాలు ఉమర్ నబీదేనని తేలడంతో, పేలుడు జరిగిన సమయానికే అతడు కారు లోపల ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. ఢిల్లీ పోలీసులు కూడా ఈ విషయాన్ని అధికారికంగా నిర్ధారించారు. పేలుడు జరిపిన వ్యక్తి డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అనే అంశం డీఎన్‌ఏ పరీక్షల ద్వారా తేలిందని వారు తెలిపారు. ఉమర్ తల్లి నుంచి సేకరించిన నమూనాలతో పరీక్షలు జరపగా ఫలితాలు సరిపోయినట్లు పేర్కొన్నారు. పేలుడు అనంతరం అతని కాలు కారు స్టీరింగ్ వీలు, యాక్సిలేటర్ మధ్య ఇరుక్కుపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
దాడికి ఉపయోగించిన తెల్లటి హ్యుందాయ్ i20 కారును పేలుడుకు కేవలం 11 రోజుల ముందు కొనుగోలు చేసిన డాక్టర్ ఉమర్ బాంబు దాడికి పాల్పడ్డాడని దర్యాప్తు అధికారులు ముందుగానే అనుమానించారు. కాశ్మీర్‌లోని పుల్వామాలో అతని కుటుంబ సభ్యుల నుండి తీసుకున్న DNA నమూనాలను తరువాత కారు నుండి స్వాధీనం చేసుకున్న మానవ అవశేషాలతో సరిపోల్చగా, హ్యుందాయ్ i20 కారు పేలినప్పుడు డాక్టర్ ఉమర్ కారును నడుపుతున్నాడని నిర్ధారించారని వర్గాలు తెలిపాయి.