విజయ్ అహంకారి : డీఎంకే

కరూర్ తొక్కిసలాట కేసుపై ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి.

By -  Medi Samrat
Published on : 3 Oct 2025 3:14 PM IST

విజయ్ అహంకారి : డీఎంకే

కరూర్ తొక్కిసలాట కేసుపై ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. టీవీకే నేత, సినీ నటుడు విజయ్‌పై డీఎంకే పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. డీఎంకే తన మౌత్‌పీస్ మురసోలిలో ప్రచురించిన కథనంలో, 'విజయ్ విడుదల చేసిన వీడియో అతని అహంకారాన్ని, డబ్బు, పబ్లిసిటీ, అధికారం పొందాలనే కోరికను చూపిస్తుంది' అని విజయ్‌పై తీవ్ర దాడి చేసింది.

విజయ్ ఒక వీడియోను విడుదల చేసి ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా.. అది తనపై తీసుకోవాలని.. తన పార్టీ కార్యకర్తలను వదిలివేయండని పేర్కొన్నాడు. దీన్ని దృష్టిలో ఉంచుకుని డీఎంకే మాట్లాడుతూ.. 'ప్రభుత్వం ఒత్తిడితోనే విజయ్‌ మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల పరిహారం ప్రకటించారు. ఎందుకంటే ప్రభుత్వం రూ.10 లక్షలు ఇవ్వాలని అడిగితే.. రూ.20 లక్షలు ఇస్తానని ప్రకటించి, ప్రభుత్వం రూ.లక్ష ఇస్తే విజయ్ రెండు లక్షలు ఇస్తానని మాట్లాడాడని గుర్తుచేశారు.

కరూర్ తొక్కిసలాటపై బీజేపీ ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేయడంపై సీఎం స్టాలిన్ మండిపడ్డారు. కరూర్‌ తొక్కిసలాటపై బీజేపీ రాజకీయాలు చేస్తోందని, ప్రజల ఆందోళనల కంటే వచ్చే ఎన్నికలపైనే బీజేపీ ఎక్కువ శ్రద్ధ చూపుతోందని సీఎం ఆరోపించారు. రామనాథపురం జిల్లాలో అభివృద్ధి పనులను ప్రారంభించిన సీఎం స్టాలిన్ మాట్లాడుతూ.. 'తమిళనాడులో మూడు భారీ విపత్తులు సంభవించి వేలాది మంది ప్రజలను ప్రభావితం చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎవరూ రాష్ట్రానికి రాలేదని, నిధులు విడుదల చేయలేదన్నారు.

మణిపూర్ అల్లర్లు, గుజరాత్ ఘటన, కుంభమేళాలో జరిగిన మరణాలపై దర్యాప్తు చేయడానికి బిజెపి ఏ ప్రతినిధి బృందాన్ని పంపలేదు, అయితే ఇప్పుడు కరూర్ సమస్యపై బిజెపి వెంటనే తన ప్రతినిధి బృందాన్ని పంపింది. బీజేపీ తమిళనాడు ప్రజల గురించి పట్టించుకోవడం లేదని, వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల గురించి మాత్రమే ఆందోళన చెందుతోందన్నారు.

Next Story