జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ పలు భాషల్లో ప్రసంగించారు. ఇతర రాష్ట్రాల్లోనూ తనకు అభిమానులు ఉన్నారని, ఇటీవల తాను తమిళనాడులో షణ్ముఖ యాత్ర చేసినప్పుడు మీ ప్రసంగాలు చూస్తుంటాం అని అక్కడి వారు చెప్పారన్నారు. తమిళనాడు వర్సెస్ కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న భాషా వివాదంపై పరోక్షంగా స్పందించారు. తమిళనాడుతో సహా భారతదేశమంతటికీ రెండు భాషలు కాదని బహుభాషలు కావాలన్నారు పవన్ కళ్యాణ్. ప్రజల మధ్య పరస్పర ప్రేమాభిమానాలు ఉండాలంటే భారతదేశానికి బహుభాషా విధానమే మంచిదని తెలిపారు. సంస్కృతాన్ని తిడతారు, దక్షిణాదిపై హిందీని రుద్దుతున్నారు అంటారు... అన్నీ దేశ భాషలే కదా! తమిళనాడులో హిందీ వద్దు, హిందీ వద్దు అంటుంటే నాకు మనసులో ఒకటే అనిపించింది. తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి. ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్ గఢ్ నుంచి డబ్బులు కావాలి, పనిచేసేవాళ్లందరూ బీహార్ నుంచి కావాలి, కానీ హిందీని ద్వేషిస్తామంటే ఇదెక్కడి న్యాయం? ఈ విధానం మారాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై డీఎంకే నేతలు స్పందించారు. తమిళనాడు ఎల్లప్పుడూ ద్విభాషా విధానాన్ని అనుసరిస్తుందని, తమిళం, ఇంగ్లీష్ పాఠశాలల్లో బోధిస్తారని అన్నారు. పవన్ కళ్యాణ్ పుట్టకముందే ఒక బిల్లు ఆమోదించబడిందని డిఎంకె నాయకుడు టికెఎస్ ఎలంగోవన్ అన్నారు. "తాము 1938 నుండి హిందీని వ్యతిరేకిస్తున్నాము. విద్యా నిపుణుల సలహాలు మరియు సూచనల కారణంగా తమిళనాడు ఎల్లప్పుడూ ద్విభాషా సూత్రాన్ని అనుసరిస్తుందని రాష్ట్ర అసెంబ్లీలో మేము చట్టం ఆమోదించాము. ఈ బిల్లు 1968లో పవన్ కళ్యాణ్ పుట్టకముందే ఆమోదించబడింది. తమిళనాడు రాజకీయాలు అతనికి తెలియవు" అని ఎలంగోవన్ అన్నారు.