మోదీని ప్రచారానికి రమ్మంటున్న డీఎంకె నేతలు.. ఎందుకంటే..

DMK Leaders Invites PM Modi For Election Campaign. తమిళనాడులో ఎన్నికల్లో గెలుపు ఈసారి ఎవరిని వరిస్తుందన్నది చెప్పడం రాజకీయ

By Medi Samrat  Published on  3 April 2021 8:24 AM IST
మోదీని ప్రచారానికి రమ్మంటున్న డీఎంకె నేతలు.. ఎందుకంటే..

తమిళనాడులో ఎన్నికల్లో గెలుపు ఈసారి ఎవరిని వరిస్తుందన్నది చెప్పడం రాజకీయ విశ్లేషకులకు కూడా కాస్త కష్టంగానే ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో చొచ్చుకు వెళ్లేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. మరో నాలుగురోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో ప్రచారాన్ని వేగవంతం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మధురై, కన్యాకుమారిలలో మోడీ ప్రచారం నిర్వహించనున్నారు. అన్నాడిఎంకె బిజెపితో పొత్తులో భాగంగా కొన్నినియోజకవర్గాలను బిజెపికే కేటాయించడం అన్నాడిఎంకె అభ్యర్థుల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో బిజెపి, అన్నాడిఎంకె అభ్యర్థులకు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని ప్రచారంపై డిఎంకె నేతలు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. తమ ప్రత్యర్థులైన బిజెపి, అన్నాడిఎంకె అభ్యర్థుల తరపున ప్రచారం చేసి తమ గెలుపుకు మరింత చేరువయ్యేలా చేయండి అంటూ డిఎంకె అధినేత ఎంకె. స్టాలిన్‌ సహా పలువురు నేతలు ట్విటర్‌ వేదికగా ప్రధాని మోడీని కోరారు.

మోదీ ప్రచారం చేసిన నియోజకవర్గం కాబట్టి తమ గెలుపు మార్జిన్ కూడా ఆ స్థాయిలో ఘనంగా ఉంటుందని వారు నమ్ముతున్నారు. ఈ మేరకు కుంభమ్ నియోజకవర్గం బరిలో ఉన్న డీఎంకే అభ్యర్థి ఎన్.రామకృష్ణన్ ట్విట్టర్ లో ప్రధాని మోదీని అర్థించారు. డీఎంకే సీనియర్ నేత, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈవీ వేలు, సెల్వరాజ్, తదంగం పి సుబ్రమణి, అనితా రాధాకృష్ణన్, అంబేత్ కుమార్ తదితరులు కూడా ఇదే తరహాలో మోదీని కోరడం విశేషం. కార్తికేయ శివసేనాపతి అనే డీఎంకే అభ్యర్థి కూడా... తన ప్రత్యర్థి, తమిళనాడు మంత్రి ఎస్పీ వేలుమణి తరఫున ప్రచారం చేయాలంటూ ప్రధాని మోదీని ఆహ్వానించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకేతో కలిసి బీజేపీ పోటీ చేస్తుండగా, మరోవైపు కాంగ్రెస్, డీఎంకే కలిసి పోటీ చేస్తున్నాయి. కమల్ హాసన్ పార్టీ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దిగింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఎన్నికలు మరింత ఉత్కంఠగా సాగనున్నాయి.




Next Story