ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాలపై డీకే శివకుమార్ కీల‌క వ్యాఖ్య‌లు..!

నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలను కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్వయంగా తోసిపుచ్చారు.

By Medi Samrat
Published on : 9 July 2025 5:11 PM IST

ముఖ్యమంత్రి మార్పు ఊహాగానాలపై డీకే శివకుమార్ కీల‌క వ్యాఖ్య‌లు..!

నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలను కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్వయంగా తోసిపుచ్చారు. ప్రస్తుతం మంత్రివర్గాన్ని మార్చే ఆలోచన లేదని ఆయన అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లు పూర్తయిన తర్వాత డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అవుతారనే ఊహాగానాలు మొదలయ్యాయి.

ఆయనకు సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలు ప్రతిరోజూ ఇలాంటి వాదనలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు అవన్నీ మీడియా ఊహాగానాలేనని, అలాంటి ప్లాన్ ఏమీ లేదని శివకుమార్ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం లేదన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై చర్చించేందుకు నేను, సీఎం కేంద్ర మంత్రులను కలుస్తున్నామ‌ని తెలిపారు.

2023 అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం తర్వాత సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఇద్దరూ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ ప‌డ్డారు. అయితే హైకమాండ్ జోక్యంతో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అయ్యారు. రెండున్నరేళ్ల ఫార్ములా ప్రకారం.. తొలుత‌ సిద్ధరామయ్య, ఆ త‌ర్వాత‌ శివకుమార్‌లను సీఎంలుగా ప‌ని చేస్తారని అప్పుడు చెప్పారు.

రాష్ట్రంలో సిద్ధరామయ్య పదవీకాలం నెలలు గడుస్తున్న కొద్దీ.. శివకుమార్ శిబిరంలో ఆకాంక్షలు రూపుదిద్దుకుంటూనే ఉన్నాయి. రెండున్నరేళ్లు పూర్తయిన వెంటనే శివకుమార్‌కు అవకాశం దక్కుతుందనే ఊహాగానాలు వెలువ‌డుతూనే ఉన్నాయి. హైకమాండ్ నుండి చాలా కాలం మౌనం తరువాత.. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ప్రస్తుతానికి మంత్రివ‌ర్గ‌ పునర్వ్యవస్థీకరణ చేయబోవడం లేదని, అలాంటిది జరిగితే మీడియాకు తెలియజేస్తామని అన్నారు.

సిద్ధరామయ్య, శివకుమార్ ఇద్దరూ రెండున్నరేళ్ల ఫార్ములాను బహిరంగంగా ఖండించారు. అయితే ఇప్పటికీ ఇలాంటి ఊహాగానాలు ప్రతిరోజూ వెలువ‌డుతూనే ఉన్నాయి. కాగా, మైసూరు దసరా సందర్భంగా ఎయిర్‌షోకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సిద్ధరామయ్య రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిశారు. నీటి ప్రాజెక్టుల ఆమోదం కోసం శివకుమార్ కేంద్ర మంత్రులతో మాట్లాడారు.

Next Story