సోనియా గాంధీని కించపరిచే విధంగా చేసిన వ్యాఖ్యలకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ డిమాండ్ చేశారు. అలాగే.. ఈ వ్యాఖ్య చేసిన బీజేపీ నేతను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేత బీఆర్ పాటిల్ బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. సోనియాగాంధీని విష కన్య అని వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ పెద్దఎత్తున బీజేపీపై విరుచుకుపడింది. డీకే శివకుమార్.. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేరును ప్రస్తావిస్తూ.. 'మీకు మహిళల పట్ల, మాతృత్వంపై గౌరవం ఉంటే బీఆర్ పాటిల్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేయండి. ఈ విషయంలో ప్రధాని మోదీ, కర్ణాటక ముఖ్యమంత్రి కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
డీకె శివకుమార్ మాట్లాడుతూ.. 'అబ్దుల్ కలాం కూడా సోనియా గాంధీని ప్రధాని కావాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ సోనియాగాంధీకి లేఖ రాశారని.. అయితే ఆమె ప్రధాని పదవిని నిరాకరించి.. నిజాయితీపరుడు, మంచి వ్యక్తి అయిన మన్మోహన్‌సింగ్‌ను పదేళ్లపాటు ప్రధానిని చేశారన్నారు. ఆమె భారతదేశంలో పుట్టలేదు.. కానీ ఆమె ఇప్పటికీ గొప్ప మహిళ. డీకే శివకుమార్ తీహార్ జైలులో ఉన్న రోజులను గుర్తు చేసుకుంటూ.. సోనియా గాంధీ తనను కలిసేందుకు వచ్చారని చెప్పారు. 'ఆమె తనకు తల్లిలాంటిది' అని ఆయన అన్నారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గురువారం ప్రధాని మోదీని విషసర్పంతో పోల్చారు. అయితే వివాదం ముదురుతున్న నేపథ్యంలో.. తాను ప్రధానిపై వ్యక్తిగత దాడి చేయలేదని.. బీజేపీ సిద్ధాంతాల గురించి అలా మాట్లాడానని ఖర్గే వివరణ ఇచ్చారు. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.