ఒక జిల్లా కోర్టు న్యాయమూర్తి సుప్రీంకోర్టు ముందు తన చొక్కా తీసి విచిత్రమైన నిరసనను ప్రదర్శించారు. అతని చర్య సోమవారం ఉదయం ఉన్నత న్యాయస్థానం ముందు పెద్ద సంఖ్యలో ప్రజలను ఆకర్షించింది. ఢిల్లీలోని సుప్రీంకోర్టు ముందు ఒక జిల్లా జడ్జి తన చొక్కా విప్పి అర్థనగ్న నిరసన తెలిపారు. రిపోర్టింగ్ ప్రకారం.. ఓ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో అతను నిరాశకు గురైనందున, న్యాయమూర్తి ఇలాంటి అసాధారణ చర్య తీసుకున్నారని తెలుస్తోంది. అయితే అది న్యాయమూర్తి వ్యక్తిగత విషయమని పేర్కొంటూ అధికారులు వివరణ ఇచ్చేందుకు నిరాకరించారు.
సోమవారం ఉదయం సాధారణ హడావుడితో సుప్రీంకోర్టు మెయిన్ గేటు ముందు న్యాయమూర్తి అర్ధనగ్నంగా కూర్చోవడం అక్కడున్న అందరి దృష్టిని ఆకర్షించింది. భద్రతా అధికారులు నిరసనకారుడి వద్దకు వెళ్లినప్పుడు.. అతను ఓ జిల్లా జడ్జి అని గ్రహించి నిరసనను ఆపమని అభ్యర్థించారు. అయితే న్యాయమూర్తి చాలా సేపు తన ప్రదర్శనను కొనసాగించారు. చాలా సేపు బతిమిలాడిన తర్వాత తర్వాత, అతను నిరసనను ఆపడానికి అంగీకరించాడు. ఆ తర్వాత దుస్తులు ధరించి వెళ్లిపోయాడు. నిరసన గురించి మాట్లాడటానికి అధికారులు నిరాకరించడంతో ఎటువంటి వివరాలు లేదా ఖచ్చితమైన కారణం సేకరించబడలేదు.