కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌పై మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత విశ్వాస్ సారంగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దిగ్విజయ్ పాకిస్తాన్ స్లీపర్ సెల్ అని విశ్వాస్ సారంగ్ వ్యాఖ్యానించారు. మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా జాతీయ అంశాలపై ఆందోళనలకు దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ కమిటీ ఏర్పాటు చేయడంతో మంత్రి విశ్వాస్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ స్లీపర్ సెల్‌గా పనిచేసే దిగ్విజయ్ సింగ్‌కు కాంగ్రెస్ పార్టీ నూతన బాధ్యతలు కట్టబెట్టడం తీవ్రమైన అంశమని ఆయన పేర్కొన్నారు.
మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరుకు కాంగ్రెస్ పార్టీ గురువారం దిగ్విజయ్ అధ్యక్షతన తొమ్మిది మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ప్రియాంక, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మానిక్ చత్రాత్, బీకే హరిప్రసాద్, రిపుణ్ బోరా, ఉదిత్ రాజ్, రాగిణి నాయక్, జుబేర్ ఖాన్ ఇతర సభ్యులుగా ఉన్నారు. ఇక ఈనెల 20 నుంచి 30 వరకూ విపక్షాలతో కలిసి మోదీ సర్కార్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సంయుక్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా సమస్యలకు వ్యతిరేకంగా జరిపే పోరాటాల కోసం ఈ కమిటీని సోనియా గాంధీ నియమించారు. దిగ్విజయ్ సింగ్ నాయకత్వంలోని కమిటీలో 9 మంది సభ్యులు ఉంటారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. కాగా ఈ కమిటీలో రాహుల్ గాంధీకి చోటు దక్కలేదు.