శబరిమల దేవాలయం నుంచి స్వామివారి ప్రసాదాన్ని స్పీడు పోస్టు ద్వారా భక్తులకు చేరవేయాలని భారత తపాలా శాఖ నిర్ణయించింది. తపాలా శాఖ తనకున్న విస్తారమైన నెట్ వర్కును ఉపయోగించి దేశం నలుమూలల ఉన్న భక్తులకు ప్రసాదాన్ని ఇంటివద్ద డెలివరీ చేయాలని నిర్ణయించింది. దీనికోసం కేరళ పోస్టల్ సర్కిల్.. ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డుతో ఒప్పందం కుదుర్చుకుంది.
శబరిమల ప్రసాదం ప్యాకెట్ ను 450 రూపాయలు చెల్లించి భక్తులు ఏ పోస్టాఫీసు నుంచి అయినా బుక్ చేసుకోవచ్చు. నేతితో కూడిన ప్రసాదంతోపాటు విభూతి, కుంకుమ, పసుపు, అర్చన ప్రసాదం ప్యాకెట్ లు ఉంటాయి. ఒక భక్తుడు ఒకేసారి పది ప్యాకెట్ల ప్రసాదం వరకు బుక్ చేసుకోవచ్చు. ప్రసాదం స్పీడ్ పోస్టు కింద బుక్ చేసుకోగానే వెంటనే నంబరుతో భక్తుడికి సందేశం వస్తుంది.
వెబ్ సైట్ లో లాగిన్ అయి ప్రసాదం ఎక్కడివరకు వచ్చిందన్న సమాచారాన్ని ట్రాకింక్ కూడా చేయవచ్చు. శబరిమల ప్రసాదం కోసం 9వేల మంది భక్తులు బుక్ చేసుకున్నారు. నవంబరు 16 నుంచి శబరిమల ఆలయాన్ని తెరిచినా కొవిడ్ కారణంగా కఠినమైన నిబంధనలు పాటించాల్సి వస్తోంది. ఈ సీజనులో తక్కువ సంఖ్యలో భక్తులను మందిరం సందర్శనకు అనుమతించనున్నారు.