రాష్ట్రంలో పార్టీ పేలవమైన ఫలితాలకు బాధ్యత వహిస్తూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన పదవికి రాజీనామా చేశారు. ఫడ్నవీస్ మాట్లాడుతూ.. 'మహారాష్ట్రలో పార్టీని నేను నడిపిస్తున్నందున అలాంటి ఫలితాలకు నేను బాధ్యత వహిస్తాను. వచ్చే ఎన్నికల్లో పార్టీ కోసం మరింత కష్టపడి పని చేసేలా.. ప్రభుత్వ బాధ్యతల నుంచి నన్ను తప్పించాలని బీజేపీ హైకమాండ్‌ని కోరుతున్నానని పేర్కొన్నారు. అయితే ఆయన రాజీనామా ఆమోదం పొందిందా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. మహారాష్ట్రలో ఫలితాలు బీజేపీని నిరాశపరిచాయి. బీజేపీ గత ఎన్నికల్లో 23 సీట్లు గెలుచుకోగా.. ఈసారి 9 సీట్లకు తగ్గడం గమనార్హం.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధికంగా ఓడిపోయిన రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా ఉంది. మహారాష్ట్రలో బీజేపీ కేవలం తొమ్మిది సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. తిరుగుబాట్లు, పార్టీలో చీలికలను ఎదుర్కొన్న శివసేన(7), యుబిటి(9), ఎన్‌సిపి ఎస్‌పి(9)లు మంచి ఫలితాలు రాబట్టాయి. ఇక అందరినీ ఆశ్చర్యపరుస్తూ కాంగ్రెస్ 13 సీట్లు గెలుచుకుని రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని కూటమి పనితీరుపై వ్యతిరేకత ఉంది. ఇది ఈ ఫలితాలలో స్పష్టంగా కనపడింది. దీంతో కాంగ్రెస్‌తో పాటు ఉద్ధవ్ ఠాక్రేకి చెందిన శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీలు ప్రజల సానుభూతిని పొందాయి.