డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ను అనారోగ్యం వెంటాడుతూ ఉంది. తాజాగా కరోనా బారిన పడ్డారు. డేరాబాబాకు ఆదివారం నాడు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో గురుగ్రామ్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మూడురోజుల క్రితం ఆయనకు విపరీతమైన కడుపునొప్పి రావడంతో రోహతక్‌లోని పీజీఐఎంఎస్ ఆసుపత్రికి తరలించి సిటీస్కాన్ పరీక్షలు చేయించారు. ఇప్పుడు కరోనా బారిన పడ్డారు.
మే నెలలో డేరా బాబా పెరోల్ పై బయటకు వచ్చాడు. అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న తల్లిని చూడాలని.. అందుకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ డేరా బాబా కోరాడు. అతడి అభ్యర్థనను మన్నించి.. పెరోల్ ను అధికారులు మంజూరు చేశారు. అస్వస్థతతో ఉన్న తన తల్లిని చూసేందుకు 21 రోజుల పెరోల్ కోరుతూ మే నెల 17న ఆయన దరఖాస్తు చేసుకోగా, రాష్ట్ర పోలీసులు ఇందుకు అనుమతించారు. రోహ్‌తక్‌లోని సునరియా జైలు నుంచి డేరాబాబా పెరోల్‌పై విడుదలయ్యారు.
ఆగష్టు 25, 2017న డేరా బాబాను అరెస్టు చేశారు. ఇద్దరు మహిళా శిష్యులపై అత్యాచారం, జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతిని హత్య చేసిన ఆరోపణలపై డేరా బాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. 2002లో డేరా బాబాతో పాటు ఆయన ముగ్గురు అనుచరులైన కిషన్ లాల్, నిర్మల్ సింగ్, కుల్దీప్ సింగ్‌లు జర్నలిస్ట్ రామ్ చందర్ ఛత్రపతిని చంపేశారు. ఈ కేసులో డేరాబాబాను దోషిగా కోర్టు తేల్చింది. ఆశ్రమంలోని మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డారనే ఆరోపణలపై డేరాబాబా శిక్షను అనుభవిస్తున్నారు. డేరా బాబా ఎక్కడ ఉన్నాడో చెప్పకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.