భర్తతో శారీరక సంబంధాన్ని నిరాకరించడం, అతనికి వివాహేతర సంబంధం ఉందని అనుమానించడం క్రూరత్వానికి సమానం.. అందుకు విడాకులు ఇవ్వవచ్చని బాంబే హైకోర్టు తెలిపింది. కుటుంబ కోర్టు విడాకుల ఉత్తర్వును సవాలు చేస్తూ ఒక మహిళ వేసిన పిటీషన్ ను తప్పుబట్టింది. జస్టిస్ రేవతి మోహితే డెరె, జస్టిస్ నీలా గోఖలేలతో కూడిన డివిజన్ బెంచ్ ఆ మహిళ ప్రవర్తన ఆమె భర్తపై "క్రూరత్వం"గా భావించవచ్చని పేర్కొంది. విడాకుల కోసం పురుషుడి అభ్యర్థనను అనుమతించిన కుటుంబ కోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
భర్తతో శృంగారానికి నిరాకరించడం, వివాహేతర సంబంధాలు ఉన్నాయని అనుమానించడం క్రూరత్వంగా పరిగణించబడుతుందని కోర్టు స్పష్టం చేసింది. 2013లో వివాహం చేసుకున్న ఒక జంట ఆ తర్వాత సంవత్సరం నుంచి విడివిడిగా జీవిస్తోంది. శృంగారానికి నిరాకరించడంతో పాటు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో తనను వేధిస్తోందని, అందరి ముందు అవమానిస్తూ మానసిక వేదనకు గురి చేస్తోందని భర్త ఆరోపించారు. ఆయన 2015లో పుణేలోని ఫ్యామిలీ కోర్టును విడాకుల కోసం ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం విడాకులకు అనుమతించింది. ఫ్యామిలీ కోర్టు తీర్పుపై భార్య బాంబే హైకోర్టును ఆశ్రయించింది. తనను అత్తమామలు మాత్రమే వేధించారని, భర్తపై తనకు ప్రేమ ఉందని భార్య తన పిటిషన్‌లో పేర్కొంది. అయితే భర్త మాత్రం విడాకులు కోరుకున్నారు.