డెల్టా వేరియంట్.. అందరినీ టెన్షన్ పెడుతూ..!

Delta Variant In India. భారత్‌లో గుర్తించిన కరోనా వేరియంట్‌ బీ1. 617.2 కు 'డెల్టా'గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే..!

By Medi Samrat  Published on  13 Jun 2021 2:06 PM GMT
డెల్టా వేరియంట్.. అందరినీ టెన్షన్ పెడుతూ..!

భారత్‌లో గుర్తించిన కరోనా వేరియంట్‌ బీ1. 617.2 కు 'డెల్టా'గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే..! ఇతర వేరియంట్లతో పోలిస్తే 60 శాతం వేగంగా వ్యాప్తి చెందుతోందనే రీసెర్చ్ ల కారణంగా భయాలు ఎక్కువ అవుతూ ఉన్నాయి. భారత్ లో సెకండ్ వేవ్ ఉధృతికి ఈ వేరియంట్ కారణమని నిపుణులు చెప్పారు. తాజాగా యునైటెడ్ కింగ్డమ్ లో కూడా ఈ వేరియంట్ టెన్షన్ ఎక్కువైంది.

ఈ నెల 21తో యూకేలో లాక్‌డౌన్ ఆంక్షలు ఎత్తివేయాలని బోరిస్ జాన్సన్ ప్రభుత్వం భావించగా.. డెల్టా వేరియంట్ కారణంగా లాక్‌డౌన్‌ను మరో నెల రోజులపాటు పొడిగించారు. యూకే వ్యాప్తంగా గత వారం రోజుల్లో డెల్టా వేరియంట్ కేసులు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతానికి లాక్‌డౌన్ ఎత్తివేత ఆలోచనను విరమించుకున్న ప్రభుత్వం.. మరో నాలుగు వారాలపాటు ఆంక్షలను కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. యూకేలో గత 24 గంటల్లో 8,125 కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.

యూకేలో ఈ వేరియంట్‌ వేగంగా పెరుగుతోందని, ఇతర వేరియంట్ల కన్నా తొందరగా వ్యాపిస్తోందని పలు పరిశోధనలు చెబుతూ ఉన్నాయి. ఢిల్లీలో ఈ డెల్టా వేరియంట్‌ ఏప్రిల్‌లో 60 శాతం కేసులకు కారణమైందని తెలిపింది. డెల్టా వేరియంట్ అమెరికా,యూకెతో సహా కనీసం 60 దేశాలలో ఉందని కోవిడ్ -19 జెనోమిక్స్ యుకే కన్సార్టియం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చైర్ షరోన్ పీకాక్ ది వాల్ స్ట్రీట్ జర్నల్ టెక్ హెల్త్ ఈవెంట్ లో చెప్పారు. ఆల్ఫా వేరియంట్, బీ1.117 కంటే 50 శాతం ఇది ఎక్కువ వ్యాప్తిచెందుతుందని గుర్తించామని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, సీఎస్‌ఐఆర్‌, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్‌ ఇంటిగ్రేటివ్ బయాలజీ నిపుణులు వెల్లడించారు. ఆల్ఫా వేరియంట్‌తో పోలిస్తే డెల్టా వేరియంట్‌ వ్యాక్సిన్‌ ప్రభావాన్ని బాగా తగ్గిస్తున్నదని, ముఖ్యంగా ఒక డోసు తర్వాత ఇది ఎక్కువగా కనిపిస్తోందని నివేదిక పేర్కొంది. రెండు డోసుల తర్వాత డెల్టా వేరియంట్‌పై వ్యాక్సిన్‌ ప్రభావం బాగానే ఉంటోందని, కానీ కాలానుగుణంగా ప్రభావం తగ్గుదల ఆల్ఫా కన్నా ఎక్కువగా ఉందట..!

కొత్త వేరియంట్ల గురించి దేశ వ్యాప్తంగా సీరో సర్వేలు చేపట్టం ఎంతో అవసరమని సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ పరిశోధన సంస్థ(సీసీఎంబీ) సలహాదారు డా. రాకేశ్ మిశ్రా తెలిపారు. డెల్టా వేరియంట్‌లో కూడా మరో రెండు నెలల్లో ఉత్పరివర్తనాలు చోటుచేసుకుంటాయని ఆయన చెప్పారు. సెరో సర్వేల ద్వారా..దేశంలో ఇన్ఫెక్షన్ల రేటు ఎంత ఉంది..? ఎంత మందిలో యాంటీబాడీలు ఉన్నాయి..? హర్డ్ ఇమ్యూనిటీ సాధించేందుకు ఎంత దూరంలో ఉన్నాం వంటి ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయని ఆయన తెలిపారు.


Next Story