ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో తన బైక్‌ను పోలీసులు సీజ్ చేశారన్న ఆవేదనతో అక్షయ్ కాశ్యప్ అనే 32 ఏళ్ల డెలివరీ ఎగ్జిక్యూటివ్ పోలీస్ స్టేషన్లోనే నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అతడి శరీరానికి తీవ్ర గాయాలు కావడంతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన జీవనోపాధికి ఆధారమైన మోటార్ సైకిల్‌ను పోలీసులు అన్యాయంగా అదుపులోకి తీసుకోవడం వల్లే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు బాధితుడు పేర్కొన్నాడు.
అక్షయ్ కాశ్యప్ కథనం ప్రకారం.. ఎవరో వ్యక్తి తన బైక్‌ను దొంగిలించి పారిపోయే క్రమంలో ఒక కారును ఢీకొట్టాడని, ఆ ప్రమాదం కారణంగా పోలీసులు తన వాహనాన్ని సీజ్ చేశారని తెలిపాడు. ఆ రోడ్డు ప్రమాదంతో తనకు సంబంధం లేకపోయినా తనపై తప్పుడు కేసు పెట్టారని, కేసు ఉపసంహరించుకున్నా తన బైక్‌ను తిరిగి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. పదేపదే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
అయితే పోలీసులు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. అక్షయ్ తన బైక్‌ను ఒక స్నేహితుడికి ఇచ్చాడని, ఆ స్నేహితుడే ప్రమాదానికి కారణమయ్యాడని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత నిబంధనల ప్రకారమే వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని, పత్రాల వెరిఫికేషన్ తర్వాత బైక్‌ను విడుదల చేస్తామని ఎస్‌హెచ్‌ఓ (SHO) చెప్పినప్పటికీ, అక్షయ్ సహనం కోల్పోయి నిప్పంటించుకున్నాడని అడిషనల్ ఎస్పీ మనుష్ పరీక్ తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని, పోలీసుల తప్పిదం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం అక్షయ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.