ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాలుష్యం కారణంగా మూతపడ్డ స్కూళ్లను తక్షణమే తెరిచేందుకు సిద్ధపడింది. కొవిడ్ వేరియంట్ ఒమిక్రాన్ విజృంభణ వేళ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని 6వ తరగతి ఆపై తరగతుల విద్యార్థులకు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలు తెరిచేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణమే అమలులోకి వచ్చేలా భౌతిక తరగతులను పునఃప్రారంభించేందుకు అధికారిక నోటీసు ద్వారా శుక్రవారం అధికారులకు అనుమతినిచ్చింది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (సీఏక్యూఎం)తో సంప్రదించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు.
5వ తరగతి వరకు విద్యార్థులకు ఫిజికల్ క్లాసులు డిసెంబర్ 27 నుంచి ప్రారంభం కావచ్చని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. పాఠశాలలు, విద్యాసంస్థలను తెరవడం "బలవంతపు అవసరం" అని వాదిస్తూ పెద్ద సంఖ్యలో ప్రతిఫాదనలు అందాయని కమిషన్ తెలిపింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి, విధించిన ఆంక్షలపై సడలింపులకు సంబంధించి వివిధ సంస్థల అభ్యర్థనలను కమిషన్ పరిశీలించిందని ఒక ప్రకటనలో తెలిపింది. నగరంలో వాయు కాలుష్య స్థాయి పెరిగినప్పటికీ ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలల్లో భౌతిక తరగతులు నిర్వహిస్తుండటంపై సుప్రీంకోర్టు ఆదేశాల అనంతరం.. డిసెంబర్ 3న దేశ రాజధానిలోని పాఠశాలలు మూసివేయబడ్డాయి. ఇదిలావుంటే.. ఢిల్లీలో నిన్న ఒక్కరోజే 10 ఒమిక్రాన్ కేసులు నమోదవ్వడం టెన్షన్ కలిగించే విషయం.