గాలి కాలుష్యం సంక్షోభం కారణంగా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఢిల్లీలోని పాఠశాలలు రేపటి నుండి మూసివేయబడతాయని ఆ రాష్ట్ర పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు. గాలి కాలుష్యంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది. ఆ తర్వాత ప్రభుత్వం నుండి ఈ నిర్ణయం వెలువడింది. "గాలి నాణ్యత మెరుగుపడుతుందనే సూచనను పరిగణనలోకి తీసుకుని మేము పాఠశాలలను తిరిగి ప్రారంభించాము. అయితే, వాయు కాలుష్య స్థాయిలు మళ్లీ పెరిగాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు పాఠశాలలను శుక్రవారం నుండి మూసివేయాలని మేము నిర్ణయించుకున్నాము" అని మంత్రి గోపాల్ రాయ్ చెప్పారు.
కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ, పారిశ్రామిక, వాహన కాలుష్యానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్రం, ఢిల్లీ మరియు పొరుగు రాష్ట్రాలకు 24 గంటల అల్టిమేటం ఇచ్చింది. గాలి కాలుష్యం నివారణకు తీసుకునే ప్రణాళిలకలు ఇవ్వాలని తన ఆదేశాల్లో పేర్కొంది. పాఠశాలలను పునఃప్రారంభించడంపై అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని ఛీత్కరిస్తూ, "మూడేళ్లు, నాలుగేళ్ల పిల్లలు పాఠశాలలకు వెళ్తున్నారు, అయితే పెద్దలు ఇంటి నుండి పని చేస్తున్నారు" అని సుప్రీంకోర్టు పేర్కొంది. "మీ ప్రభుత్వాన్ని నిర్వహించడానికి మేము ఒకరిని నియమిస్తాము" అని ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ అన్నారు. నవంబర్ 13 నుండి మూసివేయబడిన తరువాత, పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థల్లో భౌతిక తరగతులు సోమవారం నుండి పునఃప్రారంభించబడ్డాయి.