ఉత్తరాదిని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. యమునా నది మహోగ్ర రూపం దాల్చడంతో ఢిల్లీకి వరద ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఢిల్లీలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు ఆదివారం వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు వర్క్ ఫ్రమ్ హోం విదానాన్ని పాటించాలని తెలిపారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో సరఫరా అయ్యే మంచినీటిపై కోత విధించనున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం తెలిపింది.
ఢిల్లీ డిజాస్టర్ మెనేజ్‌మెంట్ అథారిటీతో కీలక సమావేశం నిర్వహించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. వరద పరిస్థితిపై చర్చించారు. దీంతో ఢిల్లీ వాసులకు కీలక సూచనలు చేశారు. ఢిల్లీలోకి వచ్చే భారీ ట్రక్కులపై నిషేధం విధించామని కేవలం అత్యవసర సర్వీసులను మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. ఢిల్లీ వాసులు ఓపికతో ఉండాలని.. వరద ప్రవాహం తగ్గితే అన్ని పరిస్థితులు సర్దుకుంటాయని తెలిపారు. గురువారం ఉదయం యమునా నీటి మట్టం మరింత పెరిగింది. బుధవారం నాడు 207.49 మీటర్ల నుండి నేటి ఉదయం 208.46 మీటర్లకు పెరిగింది. ఇది 45 సంవత్సరాలలో అత్యధికం. లోతట్టు ప్రాంతాలు, రహదారులు మునిగిపోయాయి. ఢిల్లీలోని చాలా వీధుల్లో కార్లు, బస్సులు నీటిలో మునిగిపోయాయి.