ఢిల్లీలో రెండో మంకీపాక్స్ కేసు
Delhi reports 2nd monkeypox case. ఢిల్లీలో సోమవారం రెండో మంకీపాక్స్ కేసు నమోదైంది.
By Medi Samrat Published on 2 Aug 2022 2:06 PM IST
ఢిల్లీలో సోమవారం రెండో మంకీపాక్స్ కేసు నమోదైంది. విదేశీ పర్యటన చరిత్ర లేని 35 ఏళ్ల ఆఫ్రికన్ పౌరుడికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దీంతో దేశంలో మొత్తం మంకీపాక్స్ కేసుల సంఖ్య ఆరుకు చేరింది. మంకీపాక్స్ సోకిన రోగిని ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో చేర్చారు. అతనికి గత ఐదు రోజులుగా వంటిపై బొబ్బలు, జ్వరం ఉన్నట్లు తెలుస్తోంది. రోగి నమూనాలను పూణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి)కి పంపారు. సోమవారం సాయంత్రం వచ్చిన నివేదికలో ఆయనకు పాజిటివ్‌గా తేలింది.
దేశ రాజధానిలో మొదటి కేసు జూలై 24న నమోదైంది. విదేశీ ప్రయాణం చేయని 31 ఏళ్ల పశ్చిమ ఢిల్లీ నివాసికి పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. ఇప్పటి వరకు దేశంలో ఆరు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. కేరళలో మూడు ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి, అందులో 22 ఏళ్ల యువకుడు ఈ వ్యాధితో మరణించాడు. కేరళ రాష్ట్రంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ జూలై 30న మరణించిన 22 ఏళ్ల యువకుడికి చేసిన పరీక్షలలో "ఆ వ్యక్తికి మంకీపాక్స్ ఉందని తేలింది" అని తెలిపింది.