రాజ‌ధానిలోని ఆ రెండు స్కూళ్ల‌కు బాంబు బెదిరింపులు

దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ద్వారకలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్)కి బాంబు బెదిరింపులు వచ్చాయి.

By Medi Samrat  Published on  1 May 2024 8:54 AM IST
రాజ‌ధానిలోని ఆ రెండు స్కూళ్ల‌కు బాంబు బెదిరింపులు

దేశ రాజ‌ధాని ఢిల్లీలోని ద్వారకలో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్)కి బాంబు బెదిరింపులు వచ్చాయి. తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్‌లోని మదర్ మేరీ స్కూల్‌కు కూడా బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో ఢిల్లీ పోలీసులు, పాఠశాల యంత్రాంగం అప్రమత్తమైంది. ముందుజాగ్రత్తగా పిల్లలను బయటకు పంపారు. వెంటనే పోలీసు బృందం ఆ ప్రాంతాన్ని త‌మ ఆధీనంలోకి తీసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్వారకలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బెదిరింపు మెయిల్ వచ్చింది, అందులో పాఠశాలలో బాంబు ఉందని రాసి ఉంది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలను ఖాళీ చేయించారు. స‌మాచారం అందిన వెంట‌నే ఢిల్లీ పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, అగ్నిమాపక దళం ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అన్వేషణ కొనసాగుతోంది. అయితే పోలీసులకు ఇంకా ఏమీ దొరకలేదని స‌మాచారం అందుతోంది.

తూర్పు ఢిల్లీలోని మయూర్ విహార్‌లో ఉన్న మదర్ మేరీ స్కూల్‌కు కూడా ఈ ఉదయం బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. పాఠశాలను ఖాళీ చేయించి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Next Story