ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశానికి ముందు ఎమ్మెల్యేల జీతాలు, అలవెన్సులు 66 శాతానికి పైగా పెరిగాయి. గత ఏడాది జూలై 4వ తేదీన ఎమ్మెల్యేల జీతాలు పెంచుతూ ఢిల్లీ అసెంబ్లీ తీర్మానం చేయగా.. ప్రస్తుతం ఆ నిర్ణయానికి భారత రాష్ట్రపతి ఆమోదం లభించింది. 12 ఏళ్ల తర్వాత ఢిల్లీ ఎమ్మెల్యేల జీతాలు పెరిగాయి. ఢిల్లీ అసెంబ్లీలో ఉన్న మొత్తం 70 మందికి పెంచిన జీతాలు ఫిబ్రవరి 14 నుంచి అమలులోకి రానున్నాయి.
జులై 2022లో ఢిల్లీ అసెంబ్లీ ఎమ్మెల్యేలు, మంత్రుల జీతాలను పెంచుతూ ఢిల్లీ అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ ప్రతిపాదనకు రాష్ట్రపతి ఆమోదం లభించడంతో లా డిపార్ట్‌మెంట్ జీతాల పెంపునకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. కొత్త నోటిఫికేషన్ ప్రకారం ఎమ్మెల్యేలకు ఇప్పుడు నెలకు రూ. 90 వేలు లభించనుంది. గతంలో రూ.54,000 మాత్రమే ఉండేది. ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, ప్రతిపక్షనేతలకు కూడా జీతం, అలవెన్సులు నెలకు రూ.72 వేల నుంచి రూ.1 లక్షా 70 వేలకు పెంచినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఎమ్మెల్యేల మూల వేతనాన్ని నెలకు రూ.12 వేల నుంచి రూ.30 వేలకు, మంత్రులకు నెలకు రూ.20 వేల నుంచి రూ.60 వేలకు పెంచారు. రోజువారీ భత్యం రూ.1000 నుంచి రూ.1500కి పెంచారు.