ఎన్నిక‌లకు ముందు కేజ్రీవాల్ పార్టీకి కోలుకోలేని షాక్‌..!

ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రభుత్వ మంత్రి కైలాష్ గెహ్లాట్ అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు.

By Kalasani Durgapraveen  Published on  17 Nov 2024 11:15 AM GMT
ఎన్నిక‌లకు ముందు కేజ్రీవాల్ పార్టీకి కోలుకోలేని షాక్‌..!

ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ప్రభుత్వ మంత్రి కైలాష్ గెహ్లాట్ అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. దీంతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీని కూడా విడిచిపెట్టారు. రాజీనామాతో పాటు, పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు రాసిన లేఖలో.. ఆప్ పనితీరుపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తారు. షీష్‌మహల్ నుండి యమునా నది దుర్భర స్థితి వరకు ప్రతిదానికీ ఆమ్ ఆద్మీ పార్టీదే బాధ్యత అన్నారు. గెహ్లాట్ రాజీనామాను ముఖ్యమంత్రి అతిషి ఆమోదించారు.

కైలాష్ గెహ్లాట్ రాజీనామాపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించింది. గెహ్లాట్‌పై ఈడీ, ఆదాయపు పన్ను శాఖ చర్యలు కొనసాగుతున్నాయని.. ఆయనకు బీజేపీలో చేరడం తప్ప మరో మార్గం లేదని ఆప్ పేర్కొంది. రాజ్యసభ ఎంపీ, ఆప్ నేత సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. “కైలాష్ గెహ్లాట్ రాజీనామా బీజేపీ నీచ రాజకీయాలు, కుట్రలో భాగమేన‌న్నారు. ఈడీ-సీబీఐ దాడులు నిర్వహించి కైలాష్ గెహ్లాట్‌పై ఒత్తిడి తేవ‌డంతో బీజేపీ ఇచ్చిన స్క్రిప్టు ప్రకారం ఆయ‌న మాట్లాడుతున్నారు. ఢిల్లీ ఎన్నికలకు ముందు మోడీ వాషింగ్ మెషిన్ యాక్టివేట్ అయింది. ఇప్పుడు ఈ మెషీన్ ద్వారా చాలా మంది నేతలు బీజేపీలో చేరనున్నారని అన్నారు.

కేబినెట్‌ మంత్రి గెహ్లాట్‌ ఆప్‌కి రాజీనామా చేస్తూ కేజ్రీవాల్‌కు రాసిన లేఖలో ఆప్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే.. ఎమ్మెల్యేగా, మంత్రిగా అవ‌కాశం క‌ల్పించినందుకు కేజ్రీవాల్‌కు మర్యాదపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. అయితే అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ పనితీరుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గెహ్లాట్ తన లేఖలో యమునా నది కాలుష్యం, ఆమ్ ఆద్మీ పార్టీని ఎక్కువగా కలవరపెడుతున్న 'షీష్‌మహల్' వివాదం గురించి కూడా ప్రస్తావించారు.

ఆప్ ప్రభుత్వ మంత్రి ఒకరు మంత్రి పదవిని మాత్రమే కాకుండా పార్టీని కూడా వదిలిపెట్టడం గత ఎనిమిది నెలల్లో ఇది రెండోసారి. అంతకుముందు.. ఏప్రిల్ 10న లోక్‌సభ ఎన్నికలకు ముందు అప్పటి ఢిల్లీ ప్రభుత్వ మంత్రి రాజ్‌కుమార్ ఆనంద్ కూడా తన మంత్రి పదవితో పాటు పార్టీని విడిచిపెట్టారు. పార్టీ అగ్రనాయకత్వంపై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. దీని తర్వాత దక్షిణ ఢిల్లీలోని ఛతర్‌పూర్ స్థానం నుండి ఎమ్మెల్యే కర్తార్ సింగ్ కూడా సెప్టెంబర్ 24న ఆప్‌ని వీడారు. అయితే ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు బీజేపీలో చేరారు.


Next Story