మెట్రో రైల్వే స్టేషన్స్ లోనూ, రైలులోనూ వీడియోలు రికార్డు చేసి.. సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ వస్తుంటారు. ముఖ్యంగా డ్యాన్స్ లు చేస్తూ ఉండడం చాలా మందికి ఇబ్బంది కలిగిస్తూ వస్తోంది. అందుకే ఢిల్లీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) రైలు కోచ్‌లలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు వీడియోలు తీసుకోనివ్వకుండా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇతర ప్రయాణీకులకు ఇబ్బంది, అసౌకర్యానికి కారణమయితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. మెట్రో కోచ్‌ల లోపల వీడియోలను చిత్రీకరించవద్దని DMRC పదేపదే హెచ్చరించినప్పటికీ, కొందరు అసలు పట్టించుకోవడం లేదు. మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు వీడియోలను రికార్డ్ చేయకుండా ప్రయాణికులను నిషేధిస్తూ DMRC మరోసారి స్పష్టం చేసింది.
సోమవారం నాడు DMRC ట్విట్టర్‌లో పబ్లిక్ సర్వీస్ సందేశాన్ని పంచుకుంది. మెట్రో ట్రైన్ లో "ప్రయాణం చేయండి.. అంతేకానీ ఇబ్బంది కలిగించవద్దు" అని రాసి ఉంది. ఢిల్లీ మెట్రో లోపల రీల్స్ చిత్రీకరించడం, డ్యాన్స్ వీడియోలు, ప్రయాణీకులకు అసౌకర్యం కలిగించే ఏవైనా కార్యకలాపాలను ఖచ్చితంగా నిషేధిస్తున్నామని తెలిపింది.