ఢిల్లీలోని ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. పెరుగుతున్న COVID-19 కేసుల మధ్య ఈ నియమ నిబంధనలను తీసుకుని వచ్చింది. నియమాన్ని ఉల్లంఘించిన వారికి ₹ 500 జరిమానా విధించబడుతుందని పేర్కొంది. ప్రైవేట్ కార్లలో ప్రయాణించే వారు మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు. మాస్క్ నిబంధన కొద్దిరోజుల కిందట సడలించబడింది.. అయితే పెరుగుతున్న కోవిడ్ కేసుల కారణంగా, అధికారులు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేశారు. నోయిడాలో, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లు ధరించనందుకు 100 మందికి పైగా జరిమానా విధించారు.
కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో.. ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. విద్యార్థులు, సిబ్బందిని థర్మల్ స్కానింగ్ లేకుండా పాఠశాలల్లోకి అనుమతించకూడదని ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలలకు COVID-19 మార్గదర్శకాలు జారీ చేసింది. మధ్యాహ్న భోజనం, స్టేషనరీ వస్తువులను పంచుకోకుండా విద్యార్థులకు సూచించారు. ఢిల్లీలో గత కొద్ది రోజులుగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గురువారం నగరంలో కొత్తగా 965 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. బుధవారం నాడు 1,009, మంగళవారం నాడు 632, సోమవారం నాడు 501 కేసులు నమోదయ్యాయి.